ప్రచారంలో వివాదాస్పద వ్యాఖ్యలు.. పార్టీ నుంచి బీజేపీ నేత బహిష్కరణ 

6 Nov, 2023 08:51 IST|Sakshi

జైపూర్‌: దేశంలో ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో భాగంగా ప్రచారం జోరుగా సాగుతోంది. ఎన్నికల సందర్బంగా నేతలు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. కొందరు నేతలు ప్రచారంలో హద్దులు మీరడంతో పార్టీలు వారిపై చర్యలకు దిగుతున్నాయి. తాజాగా రాజస్థాన్‌కు చెందిన బీజేపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో ఆయన్ను పార్టీ నుంచి బహిష్కరించింది. 

వివరాల ప్రకారం.. రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికల ర్యాలీలో విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసిన సందీప్‌ దయమాపై బీజేపీ కఠిన చర్యలు తీసుకుంది. ఈ క్రమంలో సందీప్‌ బీజేపీ ప్రాథమిక సభ్యత్వాన్ని తొలగించింది. అయితే, రాజస్థాన్‌లోని అల్వార్‌లో జరిగిన ర్యాలీలో పార్టీ సిద్ధాంతానికి విరుద్ధంగా వ్యాఖ్యలు చేసినందుకు అతడిపై చర్యలు తీసుకున్నట్లు క్రమశిక్షణ కమిటీ వెల్లడించింది. 

కాగా, ఎన్నికల ప్రచారంలో భాగంగా సందీప్‌ దయమా ఓ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మసీదులు, గురుద్వారాలను ఉద్దేశించి సందీప్‌ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. దీంతో, రంగంలోకి దిగిన పార్టీ హైకమాండ్‌ ఆయనపై చర్యలు తీసుకుంది. మరోవైపు.. సందీప్‌ వ్యాఖ్యలపై పంజాబ్‌ మాజీ సీఎం అమరీందర్‌సింగ్‌, ఇతర పార్టీ నేతలు తీవ్రంగా స్పందించారు. ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. దీంతో సందీప్‌ దయమాను పార్టీ నుంచి బహిష్కరిస్తూ రాజస్థాన్ బీజేపీ క్రమశిక్షణా కమిటీ చైర్మన్ ఓంకార్ సింగ్ లఖావత్ నిర్ణయం తీసుకున్నారు. 
 

మరిన్ని వార్తలు