సర్జికల్ స్ట్రైక్ హీరోకి మణిపూర్ అల్లర్ల బాధ్యతలు

3 Sep, 2023 12:11 IST|Sakshi

ఇంఫాల్‌:మణిపూర్‌లో హింసాత్మక ఘటనల తర్వాత ప్రభుత్వం కీలక చర్యలు చేపడుతోంది. శాంతియుత పరిస్థితులు నెలకొల్పడానికి కావాల్సిన అన్ని కోణాల్లో ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే అక్కడి పరిస్థితుల్ని చక్కదిద్దడానికి కీలక అధికారిని నియమించింది. 2015లో మయన్మార్‌పై జరిపిన సర్జికల్ స్ట్రైక్స్ లో కీలక పాత్ర పోషించిన రిటైర్డ్ ఆర్మీ అధికారి నెక్టార్ సంజెన్‌బామ్‌ను నియమించింది. 

మణిపూర్ పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో కల్నల్ నెక్టార్ సంజెన్‌బామ్‌ను సీనియర్ సూపరింటెండెంట్‌గా ప్రభుత్వం నియమించింది. ఐదేళ్ల పాటు పదవిలో ఆయన కొనసాగనున్నారని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు ఆగష్టు 24న నియమాక ఉత్తర్వుల్లో పేర్కొంది. కల్నల్ నెక్టార్‌ సంజెన్‌బామ్‌కు అత్యున్నత పురష్కారాల్లో రెండోదైన కీర్తి చక్రతో పాటు  మూడో అత్యున్నత పురస్కారం శౌర్య చక్ర కూడా ఇప్పటికే లభించాయి. సహసోపేతమైన నిర్ణయాలతో ఎలాంటి పరిస్థితుల్నైన చక్కదిద్దే వ్యూహాలను రచించగలరనే పేరు ఆయనకు ఉంది. 

ఈ మేరకు కేబినెట్ జూన్ 12న నిర్ణయం తీసుకుందని ఆగష్టు 24న మణిపూర్ హోం శాఖ తెలిపింది. మణిపూర్‌లో మెయితీ, కుకీ తెగల మధ్య ఇంకా ఘర్షణలు జరుగుతున్నాయి. గత ఐదు రోజుల్లోనే రాష్ట్రంలో 12 మంది మరణించారు. 30 మంది గాయపడ్డారు. ఈ నేపథ్యంలో అల్లరి మూకలను అణిచివేయడానికి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 

మెయితీ తెగ ప్రజలకు గిరిజన హోదా ఇవ్వాలని హైకోర్టు తీర్పు వెలువరించిన తర్వాత రాష్ట్రంలో అశాంతియుత పరిస్థితులు నెలకొన్నాయి. మెయితీ, కుకీ తెగల మధ్య మే 3న మొదటిసారి ఘర్షణలు జరిగాయి. ఇప్పటివరకు అక్కడ జరిగిన హింసాత్మక ఘటనల్లో 170 మందికి పైగా మరణించారు. 

ఇదీ చదవండి: సీఎం స్టాలిన్ కుమారుడు ఉదయనిధి వివాదాస్పద వ్యాఖ్యలు..


 

మరిన్ని వార్తలు