Reverse Waterfall: ఆకాశంలోకి ఎగిరే జలపాతాన్ని ఎప్పుడైనా చూశారా?

11 Jul, 2022 19:01 IST|Sakshi

ముంబై: ఎత్తైన కొండల నుంచి కిందికి జాలువారే జలపాతాల్ని చాలానే చూసి ఉంటాం. కానీ గాల్లో పైపైకి ఎగిరే జలపాతాన్ని ఎప్పుడైనా చూశారా? అలా ఎలా అనుకుంటున్నారా? అవునండి అది నిజమే.. ఆకాశంలోకి ఎగిరే జలపాతం ఎక్కడో కాదు మన దేశంలోనే కనువిందు చేస్తోంది. మన పక్క రాష్ట్రం మహారాష్ట్రలోనే ఈ ప్రకృతి అద్భుతం ఆవిష్కృతమైంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. 

ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌(ఐఎఫ్‌ఎస్‌) అధికారి సుశాంత్ నంద.. ఆకాశంలోకి ఎగిరే జలపాతం అద్భుత దృశ్యాలను ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. అంతే కాదు.. అసలు ఇలా రివర్స్‌ వాటర్‌ఫాల్‌ ఎలా ఏర్పడుతుందనే విషయాన్ని వివరించారు. గురుత్వాకర్షణ, గాలి ఒకదానినొకటి వ్యతిరేక దిశలో సమానంగా ఉన్నప్పుడు ఇలాంటివి సంభవిస్తాయని తెలిపారు. పశ్చిమ కనుమల్లోని నానేఘాట్‌ వద్ద ఆదివారం ఇదే జరిగిందంటూ దానికి సంబంధించిన దృశ్యాలను ట్విట్టర్‌లో షేర్‌ చేశారు. 

వర్షాకాల సోయగం..
ఈ ప్రకృతి అద్భుతాన్ని 'వర్షాకాల సోయగం'గా అభివర్ణించారు నంద. ఈ వీడియో పోస్ట్‌ చేసిన కొన్ని గంటల్లోనే 3 లక్షల వీక్షణలు, 15వేలకుపైగా లైక్‌లు సంపాదించింది. చాలా మంది ఆ అద్భుతంపై కామెంట్లు చేశారు. 'ఆ ప్రాంతాన్ని నేను సందర్శించాను. అది భూలోక స్వర్గం' అంటూ ఓ నెటిజన్‌ రాసుకొచ్చారు. 'దీనికన్నా సుందరమైనదాన్ని ఇప్పటి వరకు చూడలేదు' అంటూ మరో నెటిజన్‌ పేర్కొన్నారు.

ఇదీ చదవండి: IndiGo Airlines: 'క్యూట్‌'గా ఉంటే విమాన టికెట్‌పై అదనపు ఛార్జ్‌.. ఇందులో నిజమెంత? 

మరిన్ని వార్తలు