రెండు వేల ఏళ్లుగా వాళ్లను వెనకే ఉంచాం.. రిజర్వేషన్లపై ఆరెస్సెస్‌ చీఫ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

7 Sep, 2023 08:06 IST|Sakshi

నాగ్‌పూర్‌: రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌.. రిజర్వేషన్లపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. సమాజంలో వివక్ష ఉన్నంతకాలం రిజర్వేషన్లు కొనసాగాల్సిందేనని అభిప్రాయపడ్డారాయన. బుధవారం నాగ్‌పూర్‌లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లకు ఆరెస్సెస్‌ పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు. 

వ్యవస్థలో మనం.. తోటి మనుషులను(కొన్ని వర్గాలను) చాలా ఏండ్లు వెనుకే ఉంచుతూ వచ్చాం. దాదాపు 2 వేల ఏళ్లుగా ఇది కొనసాగింది. ఎప్పుడైతే సమానత్వం లాంటివి ప్రత్యేకాంశాలను వాళ్లకు కల్పించామో.. ప్రత్యేకించి రిజర్వేషన్లలాంటివి వాళ్లకు ఎంతో మేలు చేస్తున్నాయి. వెనకబడిన వర్గాలకు పూర్తిస్థాయిలో మనతో సమానావకాశాలు దొరికేవరకు.. రిజర్వేషన్లలాంటి ప్రత్యేక చర్యలు అవసరమే.

అందుచేత..  వివక్ష ఉన్నంత వరకు రిజర్వేషన్లు కొనసాగించాల్సిందే. రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్‌లకు అన్ని విధాలా ఆరెస్సెస్‌ మద్దతు ఉంటుంది అని ప్రకటించారాయన. దాదాపు 2 వేల సంవత్సరాలపాటు కొన్ని వర్గాలు సంఘంలో నిర్లక్ష్యానికి గురయ్యాయన్న ఆయన.. వివక్ష ఎదుర్కొని వర్గాలు కనీసం 200 ఏండ్లైనా సరే కొంత ఇబ్బంది ఎదురైనా అంగీకరించాల్సిందేనని తెలిపారు. ఇదిలా ఉంటే.. మహారాష్ట్రలో మరాఠా కమ్యూనిటీ రిజర్వేషన్ల ఉద్యమం మరోసారి ఉపందుకుంటున్న వేళ.. భగవత్‌ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

ఇదీ చదవండి: భారత్‌ మూలాలపై రిషి సునాక్‌ భావోద్వేగం

మరిన్ని వార్తలు