వీడియో: బీజేపీ నేతపై ఎస్పీ ఎమ్మెల్యే దాడి.. కారణం ఇదే..

10 May, 2023 16:25 IST|Sakshi

అమేథి: ఉత్తరప్రదేశ్‌లో షాకింగ్‌ ఘటన చోటుచేసుకుంది. బీజేపీ నేతపై సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్యే దాడికి చేశారు. పోలీసు స్టేషన్‌ వద్ద పోలీసుల ఎదుటే ఆయన దాడి చేయడం గమనార్హం. కాగా, దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ నేపథ్యంలో వారిద్దరిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

వివరాల ప్రకారం.. సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్యే రాకేష్‌ ప్రతాప్‌ సింగ్‌ బుధవారం గౌరిగంజ్‌ కోత్వాలి పోలీసు స్టేషన్‌ వద్ద ధర్నాలో పాల్గొన్నారు. బీజేపీ నేత దీపక్ సింగ్ తన మద్దతుదారులపై దాడి చేశారని ఆరోపిస్తూ ప్రతాప్ సింగ్ నిన్న రాత్రి గౌరీగంజ్ పోలీస్ స్టేషన్ వద్ద ధర్నాకు దిగారు. ఈ సందర్బంగా బీజేపీ నేత దీపక్‌ సింగ్‌ అక్కడికి వచ్చారు. అయితే, కారు దిగిన వెంటనే దీపక్‌ సింగ్‌.. ఎమ్మెల్యే ప్రతాప్‌ సింగ్‌, అతడి అనుచరులను దూషించారు. దీంతో, ఆగ్రహానికి లోనైన రాకేష్‌ ప్రతాప్‌ సింగ్‌ ఒక్కసారిగా దీపక్ సింగ్‌పై దాడికి పాల్పడ్డారు. అతడి అనుచరులు కూడా దీపక్‌ సింగ్‌పై ఎగబడ్డారు. అయితే, ఇంతలో తేరుకున్న పోలీసులు.. వారికి అడ్డుకునే ప్రయత్నం చేశారు. కానీ.. ఎమ్మెల్యే, అతడి అనుచరులు మాత్రం బీజేపీ నేతలను తీవ్రంగా కొట్టారు. 

అనంతరం, ఎమ్మెల్యే రాకేష్‌ మాట్లాడుతూ.. మేము ప్రశాంతంగా ధర్నా చేస్తుంటే దీపక్‌ సింగ్‌ అక్కడికి వచ్చి అసభ్యకరంగా మాట్లాడారు. అతను బూతులు తిడుతున్నా పోలీసులు మాత్రం దీపక్‌ సింగ్‌ను వారించలేదు. నాపై, మా పార్టీ కార్యకర్తలను దూషించిన కారణంగానే దాడి చేశామని చెప్పుకొచ్చారు. ఇక, ఈ ఘటనలో ఇరు వర్గాలపై కేసుల నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. ఇదిలా ఉండగా.. ఎమ్మెల్యే రాకేష్ ప్రతాప్ సింగ్ పోలీసుల ఎదుటే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించిన మరో వీడియో వెలుగులోకి వచ్చింది. 

ఇది కూడా చదవండి: కర్ణాటక ఎన్నికలు.. దుఃఖాన్ని దిగమింగి బందోబస్తు విధులకు

మరిన్ని వార్తలు