అతడు రాక్షసుడిలా అనిపిస్తున్నాడు: సుప్రీంకోర్టు

29 Oct, 2020 09:57 IST|Sakshi

మహిళ హత్యకేసులో దోషి ఉరిశిక్షపై సుప్రీం స్టే

తన క్లైంట్‌ను అవసరంగా ఇరికించారన్న న్యాయవాది

కీలక వ్యాఖ్యలు చేసిన ధర్మాసనం

న్యూఢిల్లీ: మహిళను అత్యంత పాశవికంగా హత్యచేసిన కేసులో దోషిగా ఉన్న వ్యక్తికి కిందికోర్టు విధించిన ఉరిశిక్షపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. తదుపరి వాదనలు పూర్తయ్యేంత వరకు మరణశిక్షను నిలుపుదల చేసేలా బుధవారం ఆదేశాలు జారీ చేసింది. ఈ సందర్భంగా సీజేఐ ఎస్‌ఏ బాబ్డే నేతృత్వంలోని త్రిసభ్య ధర్యాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘ఇలాంటి కేసును మేమెప్పుడూ చూడలేదు. అతడు ఓ రాక్షసుడిలా అనిపిస్తున్నాడు’’అని వ్యాఖ్యానించింది. కాగా ఓ బిల్డింగ్‌ కాంప్లెక్సులో సెక్యూరిటీ గార్డుగా పనిచేసే మోహన్‌ సింగ్‌ అనే వ్యక్తి 2019లో ఓ మహిళను దారుణంగా హతమార్చాడు. ఆమె పొట్టను చీల్చి, అవయాలను బయటకు తీశాడు. ఆ తర్వాత వాటి స్థానంలో వస్త్రాన్ని కుక్కి, వైరుతో కుట్లు వేశాడు. అనంతరం ఆధారాలు మాయం చేసేందుకు ప్రయత్నించి అడ్డంగా దొరికపోయాడు.(చదవండి: ‘గృహ హింస’ బాధితురాలికి ఊరట) 

ఈ నేపథ్యంలో మోహన్‌ సింగ్‌ను అరెస్టు చేసిన పోలీసులు, ఆధారాలు సేకరించి ట్రయల్స్‌ కోర్టు ఎదుట హాజరుపరచగా, అనేక పరిణామాల అనంతరం న్యాయస్థానం అతడిని దోషిగా తేల్చి మరణశిక్ష విధించింది. రాజస్తాన్‌ హైకోర్టు సైతం ఈ తీర్పును సమర్థిస్తూ ఈ ఏడాది ఆగష్టు 9న శిక్ష ఖరారు చేసింది. ఈ క్రమంలో దోషి తరఫు న్యాయవాది, సీనియర్‌ అడ్వకేట్‌ సిద్ధార్థ్‌ లూత్రా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో దోషికి ఉరిశిక్షను నిలుపుదల చేసే విధంగా ఆదేశాలివ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా.. ‘‘మీ క్లైంట్‌ చాలా హేయమైన చర్యకు పాల్పడ్డారు. అసలెందుకు అతడు, పొట్ట చీల్చి అందులో వస్త్రాలు పెట్టినట్లు? అతడేమైనా సర్జనా?’’ అని న్యాయస్థానం ఆయనను ప్రశ్నించింది.

ఇందుకు బదులుగా.. మోహన్‌ సింగ్‌ను అనవసరంగా ఈ కేసులో ఇరికించారని, గతంలో ఓ హత్యకేసులో దోషిగా ఉన్నందున ఈ నేరం తనపై మోపారని లూథ్రా వాదనలు వినిపించారు. మృతురాలు చివరిసారిగా అతడితో మాట్లాడిందన్న ఒకే ఒక్క కారణంతో అతడే హత్యకు పాల్పడ్డాడన్న నిర్ధారణకు సరైంది కాదని పేర్కొన్నారు. అంతేగాక, ఈ కేసులో డీఎన్‌ఏ ఎక్స్‌పర్ట్స్‌ ఇంతవరకు విచారణకు హాజరురాలేదని, ఘటనాస్థలంలో గల సీసీటీవీ రికార్డులను కూడా పోలీసులు ఇంతవరకు కోర్టుకు సమర్పించలేదని చెప్పారు. ఈ క్రమంలో సరైన ఆధారాలు సమర్పించాల్సిందిగా ఆదేశిస్తూ, అప్పటివరకు మోహన్‌సింగ్‌ ఉరిశిక్షపై స్టే విధిస్తున్నట్లు సుప్రీం ధర్మాసనం పేర్కొంది.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు