ట్విటర్‌కు షాక్‌: దేశీ ట్విటర్ ‘కూ’ జోరు

10 Feb, 2021 12:04 IST|Sakshi

 ఖాతాల  నిషేధం ఆదేశాలు పాటించని ట్విటర్‌కు ఎదురుదెబ్బ

 మైక్రోబ్లాగింగ్ సైట్  ‘కూ’ వైపు అడుగులు

పెరుగుతున్న యాప్‌ డోన్‌లోడ్స్‌

సాక్షి,న్యూఢిల్లీ: పాకిస్తాన్‌, ఖలిస్తాన్‌తో లింకులున్న ట్విటర్‌ ఖాతాలను బ్లాక్ చేయాలన్న ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేసిన ట్విటర్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ‌ఎలక్ట్రానిక్స్ అండ్‌ ఐటీ మంత్రిత్వ శాఖ, ఇతర ప్రభుత్వ విభాగాలు ట్విటర్‌కు తాజాగా షాకిచ్చాయి. తాజాగా పలు ప్రభుత్వ కార్యాలయాలు స్వదేశీ మైక్రోబ్లాగింగ్ సైట్ ఆత్మనిర్భర్‌ అవార్డు గెల్చుకున్న ‘కూ’ వైపు అడుగులు వేశాయి. అంతేకాదు రైల్వే మంత్రి పియూష్ గోయల్ కూడా కూ లో చేరారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా వెల్లడించారు. భారతీయ మైక్రో బ్లాగింగ్ ప్లాట్‌ఫామ్‌లో తనతో కనెక్ట్ అవ్వాలంటూ గోయల్ ట్వీట్ చేశారు. మరోవైపు  కేంద్ర ఐటీ శాఖా మంత్రి రవిశంకర్ ప్రసాద్ గత ఏడాది నుంచే ఈ ప్లాట్‌ఫామ్‌లో సభ్యుడిగా ఉన్నారు. (రైతు ఉద్యమం : ఆ ఖాతాలకు షాక్‌)

ట్విటర్ వ్యవహారంపై సీరియస్ అవుతున్న కేంద్రంతో పాటు  కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ,దాని అనుబంధ సంస్థలు తమ సోషల్ మీడియా ఖాతాలను మేడిన్ ఇండియా ట్విటర్ ప్లాట్ ఫామ్‌లోకి మార్చుకున్నాయి. డిజిటల్ ఇండియా, నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (ఎన్ఐసి), ఇండియా పోస్ట్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (నీలిట్), డిజిలోకర్, కామన్ సర్వీసెస్ సెంటర్, ఉమాంగ్ యాప్, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ పరోక్ష పన్నులు మరియు కస్టమ్స్ ( సీబీఐసీ, నేషనల్ ఇంటర్నెట్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా కార్యాలయాలు కూడా కూలో రిజిస్టర్‌ కావడం విశేషం. దేశంలోని అత్యున్నత ప్రభుత్వ ఆఫీసులు తమ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్నాయని  కూ యాప్‌ సీఈఓ,సహ వ్యవస్థాపకుడు అప్రమేయ రాధాకృష్ణ ప్రకటించారు. దీనిపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. తాజా పరిణామంతో 10 నెలల క్రితం లాంచ్‌ అయిన  కూ యాప్‌  డౌన్‌లోడ్‌ల సంఖ్య క్రమంగా  పుంజుకుంటోంది. 

మరిన్ని వార్తలు