వినోదం కోసమే ఆమె మధ్యప్రదేశ్‌కు వస్తారు

18 Nov, 2023 09:21 IST|Sakshi

కాంగ్రెస్‌ నేత ప్రియాంకా గాంధీపై సీఎం చౌహాన్‌ వ్యాఖ్య

భోపాల్‌: కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా ఎన్నికల ప్రచారంలో సినిమాల గురించి మాట్లాడటంపై మధ్యప్రదేశ్‌ సీఎం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ పలు వ్యాఖ్యలు చేశారు. ప్రియాంకా గాంధీకి ప్రజాస్వామ్యం అన్నా ప్రజలన్నా గౌరవం లేదన్నారు. మధ్యప్రదేశ్‌కు ఆమె వినోదం కోసమే వస్తున్నారని వ్యాఖ్యానించారు. ‘ఎన్నికలను ముఖ్యమైన విషయంగా కాంగ్రెస్‌ భావించడం లేదు.

నటన, జై– వీరూ లేదా ప్రధాని మోదీపై సినిమా తీయడమే ఎన్నికల అంశమని అనుకుంటున్నారా అని ప్రియాంకా గాంధీని అడగాలనుకుంటున్నా. ఎన్నికలను ఆమె తమాషా అనుకుంటున్నారు. ఇది ప్రజలను, ప్రజాస్వామ్యాన్ని అవమానించడమే’అని పేర్కొన్నారు. ఓటమిని ఊహించిన కాంగ్రెస్‌ నేతలు ఇటువంటి వ్యాఖ్యలకు దిగుతున్నారన్నారు.

గురువారం దటియా నియోజకవర్గంలోని జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రియాంక.. సీఎం చౌహాన్‌ను ప్రపంచ ప్రఖ్యాత నటుడిగా అభివర్ణించారు. ఆయన అమితాబ్‌ను సైతం మించిపోయేవారన్నారు. అభివృద్ధిని గురించి ప్రస్తావించినప్పుడల్లా కమెడియన్‌లా ప్రవర్తిస్తారని ఎద్దేవా చేశారు. ప్రధాని మోదీని సైతం ఆమె వదల్లేదు. ప్రతిపక్షంలో ఉండగా తనను వేధించారని చెప్పుకుని మోదీ ఏడుస్తున్నారని వ్యాఖ్యానించారు. ఆయనపై మేరే నామ్‌ పేరుతో సినిమా కూడా తీయొచ్చని ప్రియాంక అన్నారు.  

మరిన్ని వార్తలు