ఓటేయడానికి ‘దారి’... జంపన్నవాగుపై  తాత్కాలిక రోడ్డు

17 Nov, 2023 09:32 IST|Sakshi
కొండాయి బ్రిడ్జి వద్ద తాత్కాలికంగా ఇసుకబస్తాలు వేసి నిర్మిస్తున్న రోడ్డు

ఏటూరునాగారం: ‘ఓటు వేయాలంటే వాగు దాటాలె’ శీర్షికన ఈ నెల 15వ తేదీన ‘సాక్షి’ పత్రికలో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. ఆర్‌అండ్‌బీ శాఖ జంపన్నవాగుపై తాత్కాలిక బ్రిడ్జికోసం నిర్మాణ పనులు చేపట్టింది. మరికొద్ది రోజుల్లో జరగనున్న  అసెంబ్లీ ఎన్నికలకు ఈవీఎంల తరలింపు, పోలింగ్‌ సిబ్బంది కొండాయి ప్రాంతానికి వెళ్లి అక్కడే పోలింగ్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేసుకునేందుకు కావాల్సిన సౌకర్యాలను కల్పిస్తున్నారు.


‘సాక్షి’లో ప్రచురితమైన కథనం

తదుపరి జరిగే మేడారం సమ్మక్క–సారలమ్మ జాతర సమయంలో పెద్ద ఎత్తున వాహనాలు ఈ తాత్కాలిక రోడ్డుపై వెళ్లేలా నిర్మాణాలు చేపడుతున్నట్టు ఆర్‌అండ్‌బీ డీఈఈ రఘువీర్‌ ‘సాక్షి’కి తెలిపారు. 60 మీటర్ల పొడవున ఇసుక బస్తాలు వేసి దానిపై సిమెంటు పైపులు, తర్వాత మళ్లీ బస్తాలు వేసిన తర్వాత మట్టితో రోడ్డు నిర్మిస్తున్నట్టు చెప్పారు.

ముంపు ప్రాంతాల్లోని ప్రజల సదుపాయం కోసం ఈ రోడ్డును త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్‌ ఇలా త్రిపాఠి ఆదేశాలు జారీ చేశారు. అధికారుల్లో కదలిక  తీసుకొచ్చిన ‘సాక్షి’కి ముంపు ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.

మరిన్ని వార్తలు