దీపావళి తర్వాత శివసేన ప్రక్షాళన

23 Oct, 2021 14:14 IST|Sakshi

విభాగ్‌ ప్రముఖ్, శాఖ ప్రముఖ్, వార్డు ప్రముఖ్‌లను మార్చే అవకాశం 

బీఎంసీ ఎన్నికల నేపథ్యంలో పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యం

సాక్షి, ముంబై: బృహన్ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌ (బీఎంసీ) ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో దీపావళి పండుగ తరువాత పార్టీలో ప్రక్షాళన చేపట్టాలని శివసేన అధిష్టానం భావిస్తోంది. అయితే, మంత్రి పదవుల జోలికి వెళ్లకుండా విభాగ్‌ ప్రముఖ్, శాఖ ప్రముఖ్, వార్డు ప్రముఖ్‌లను మార్చే అవకాశముంది. ఇదే జరిగితే పాత ముఖాల్లో ఎంతమందికి మళ్లీ అవకాశం లభిస్తుంది, కొత్తగా ఎంతమందికి అవకాశం దక్కనుందనేది తేలాల్సి ఉంది. వచ్చే సంవత్సరం ఫిబ్రవరిలో బీఎంసీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. బీఎంసీలో అధికారం చేజిక్కించుకోవాలంటే కనీసం వంద మందికిపైగా కార్పొరేటర్లను గెలిపించుకోవాల్సి ఉంటుంది. దీంతో పార్టీ అభివృద్ధి, ప్రగతి కోసం కృషి చేసే సమర్థులైన పదాధికారులు, కార్యకర్తలకు కీలక పదవీ బాధ్యతలు అప్పగించాలని శివసేన భావిస్తోంది.

చదవండి: (ఆకాశాన్నంటుతున్న కూరగాయల ధరలు)

ముంబైలో శివసేనకు 10 మంది విభాగ్‌ ప్రముఖ్‌లు ఉన్నారు. ఆ తరువాత ఉప విభాగ్‌ ప్రముఖ్‌లు, శాఖ ప్రముఖ్‌లతో శివసేన పార్టీ కొనసాగుతుంది. ముఖ్యంగా శాఖ ప్రముఖ్‌లే పార్టీకి పునాదిగా ఉంటారు. వీరే ప్రజలకు దగ్గరగా మెలుగుతూ నేరుగా సంప్రదింపులు జరుపుతారు. కానీ విభాగ్‌ ప్రముఖ్, శాఖ ప్రముఖ్‌ల వ్యవహార శైలి, పనితీరుపై స్థానిక కార్యకర్తల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. దీంతో దీపావళి తరువాత విభాగ్‌ ప్రముఖ్, శాఖ ప్రముఖ్‌లను మార్చాలని శివసేన ఆలోచిస్తోంది. ప్రస్తుతం బీఎంసీలో శివసేనకు 97 మంది కార్పొరేటర్లున్నారు. వారిలో ఆరుగురు కార్పొరేటర్లు ఎమ్మెన్నెస్‌తో తెగతెంపులు చేసుకుని శివసేనలోకి వచ్చారు. ముగ్గురు స్వతంత్ర కార్పొరేటర్లు ఉన్నారు.

స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసి గెలిచి ఆ తరువాత శివసేనలో చేరిన వారు మరో ఇద్దరు కార్పొరేటర్లున్నారు. కానీ, ఇప్పుడు పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. 2019 అక్టోబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల తరువాత ముఖ్యమంత్రి పీఠంపై నెలకొన్న విభేదాలతో బీజేపీతో శివసేన తెగతెంపులు చేసుకుంది. ఆ తరువాత ప్రధాన ప్రతిపక్షాలైన కాంగ్రెస్, ఎన్సీపీలతో జతకట్టి మహావికాస్‌ ఆఘాడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఇప్పుడు శివసేన కాంగ్రెస్, ఎన్సీపీలతో కలిసి పోటీ చేయాల్సి ఉంటుంది. కానీ, కాంగ్రెస్‌ మాత్రం ఒంటరిపోరుకే మొగ్గు చూపుతోంది.

చదవండి: (ధైర్యముంటే ఎదురునిల్చి పోరాడండి: సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే)

ఒంటరిగా పోటీచేసి తమ బలమేంటో నిరూపించుకుంటామని కాంగ్రెస్‌ నాయకులు బహిరంగంగానే ప్రకటిస్తున్నారు. దీంతో బీఎంసీలో అధికారం చేజిక్కించుకోవాలంటే శివసేనకు మెజార్టీ రావాలి. అందుకోసం పార్టీని మరింత బలోపేతం చేయాల్సి ఉంటుంది. పార్టీకి పునాదిలా ఉంటూ పటిష్టం చేయాల్సింది విభాగ్‌ ప్రముఖ్, శాఖ ప్రముఖ్‌లే కాబట్టి దమ్మున్న వారినే ఆ పదవుల్లో నియమించాలని శివసేన భావిస్తోంది. ఈ మేరకు దీపావళి తరువాత పార్టీలో ప్రక్షాళన చేయాలని శివసేన ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ పదవుల్లో ఇతర పార్టీల నుంచి శివసేనలో చేరిన వారికి అవకాశమివ్వకూడదని నిర్ణయం శివసేన అధినాయకత్వం నిర్ణయించింది. ఏళ్ల తరబడి పార్టీ అభివృద్ధి కోసం కృషి చేసిన సీనియర్‌ కార్యకర్తలనే నియమించాలని శివసేన నాయకత్వం భావిస్తోంది.   

మరిన్ని వార్తలు