స్నైఫర్‌ డాగ్‌ గర్భం దాల్చడంపై ‘బీఎస్‌ఎఫ్‌’ అనుమానాలు.. దర్యాప్తునకు ఆదేశం

31 Dec, 2022 19:50 IST|Sakshi

షిల్లాంగ్‌: ఏదైనా శునకం గర్భం దాల్చి పిల్లలకు జన్మనిస్తే ఎవరూ పెద్దగా పట్టించుకోరు. కానీ, ఆర్మీలోని భారత సరిహద్దు భద్రతా దళం(బీఎస్‌ఎఫ్‌) ఏకంగా ఉన్నతస్థాయి దర్యాప్తు చేపట్టింది. మేఘాలయ సరిహద్దుల్లో కాపలా కాస్తున్న తమ దళంలోని ఓ స్నైఫర్‌ డాగ్‌ మూడు పిల్లలకు జన్మనివ్వడంపై అనుమానాలు వ్యక్తం చేసింది. ఈ అంశంపై డిప్యూటీ కమాండెంట్‌ ర్యాక్‌ అధికారి దర్యాప్తు చేపట్టి నివేదిక సమర్పించాలని ఉన్నతాధికారులు ఆదేశించారు కూడా. 

మేఘాలయ రాష్ట్ర బీఎస్‌ఎఫ్‌ హెడ్‌క్వార్టర్‌ షిల్లాంగ్‌ ఇచ్చిన ఆదేశాల కాపీని ప్రముఖ వార్తా సంస్థ ఏఎన్‌ఐ సేకరించింది. స్నైఫర్‌ డాగ్‌ గర్భం దాల్చడంపై డిసెంబర్‌ 19న బీఎస్‌ఎఫ్‌ ఆదేశాలు జారీ చేసింది. డిసెంబర్‌ 5 ఉదయం 10 గంటలకు బార్డర్‌ ఔట్‌ పోస్టు బాఘ్మారాలో స్నైఫర్‌ డాగ్‌ లాల్సీ మూడు పిల్లలకు జన్మనిచ్చింది. ఈ అంశంపై డిప్యూటీ కమాండెంట్‌ ర్యాక్‌ అధికారి సమ్మరీ కోర్ట్‌ ఆఫ్‌ ఎంక్వైరీ చేయాలని పేర్కొంది. డిసెంబర్‌ 30, 2022 నాటికి దర్యాప్తు పూర్తి చేసి నివేదిక సమర్పించాలని ఆదేశించింది. 

మరోవైపు.. శిక్షణ ఇచ్చే బీఎస్‌ఎఫ్‌ శునకాలు వాటి సంరక్షకుల పర్యవేక్షణలో భద్రంగా ఉంటాయని ఓ సీనియర్‌ అధికారి తెలిపారు. రెగ్యులర్‌గా హెల్త్‌ చెకప్‌లు జరుగుతాయన్నారు. ఈ శునకాలు ఇతర వాటితో ఎప్పుడూ కలవవని, బ్రీడింగ్‌ చేపడితే అది పశువైద్యుల పర్యవేక్షణలోనే ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం పిల్లలకు జన్మనిచ్చిన స్నైఫర్‌ డాగ్‌ లాల్సీ భారత్‌-బంగ్లాదేశ్‌ సరిహద్దులో కాపలా కాస్తోంది.

ఇదీ చదవండి: Cameroon Green: వేలు విరిగిన విషయం తెలియక నాలుగు గంటలు ఓపికగా

మరిన్ని వార్తలు