‘విద్యార్థుల బాధ‌ను అర్థం చేసుకోగ‌ల‌ను’

28 Aug, 2020 20:07 IST|Sakshi

న్యూఢిల్లీ: సెప్టెంబర్‌లో జ‌ర‌గాల్సిన‌ జేఈఈ, నీట్ ప‌రీక్ష‌లు వాయిదా వేయాల‌ని దేశ‌వ్యాప్తంగా విద్యార్థులు ముక్త‌కంఠంతో నిన‌దిస్తున్నారు. కానీ ప్ర‌భుత్వం మాత్రం ఎట్టి ప‌రిస్థితుల్లో ప‌రీక్ష‌లు నిర్వ‌హించి తీరుతామ‌ని మొండిగా తేల్చి చెప్పింది. అయితే చాలామంది ప్ర‌ముఖులు విద్యార్థుల ప‌క్షాన నిల‌బ‌డుతూ ప‌రీక్ష‌లు వాయిదా వేయాల‌ని కేంద్రాన్ని కోరుతున్నారు. తాజాగా కాంగ్రెస్ తాత్కాలిక‌ అధినేత్రి సోనియా గాంధీ ఇదే అభిప్రాయాన్ని వ్య‌క్తం చేశారు. విద్యార్థుల బాధ‌ను అర్థం చేసుకుని ప‌రీక్ష‌లు వాయిదా వేయాల‌ని కేంద్రానికి విన్న‌వించారు. ఈ మేర‌కు శుక్ర‌వారం ఓ వీడియోను షేర్ చేశారు. (చ‌ద‌వండి: నీట్, జేఈఈల వాయిదా ఉండదు!)

"ప్రియ‌మైన విద్యార్థులారా.. మీ బాధ‌ను నేను అర్థం చేసుకోగ‌ల‌ను. ఇప్పుడు మీరు అత్యంత క్లిష్ట ప‌రిస్థితిని ఎదుర్కొంటున్నారు. ప‌రీక్ష‌లు ఎప్పుడు, ఎక్క‌డ జ‌ర‌పాలి అనే విష‌యాలు మీకు మాత్ర‌మే కాదు, మీ కుటుంబానికి కూడా ప్ర‌ధాన‌మైన స‌మ‌స్య‌గా ప‌రిణ‌మించాయి. మీరే రేప‌టి భ‌విష్య‌త్తు. భావి భారత నిర్మాణం మీ చేతుల్లోనే ఉంది. కాబ‌ట్టి మీ భ‌విష్య‌త్తును శాసించే ఏ నిర్ణ‌య‌మైనా మీ అనుమ‌తితోనే తీసుకోవాలి. అదే ముఖ్యం కూడా. ప్ర‌భుత్వం మీ మొర ఆల‌కిస్తుంద‌ని ఆశిస్తున్నా. మీ ఇష్టానికి అనుగుణంగా న‌డుచుకుంటుంద‌ని భావిస్తున్నా. ఇదే ప్ర‌భుత్వానికి నేనిచ్చే స‌ల‌హా. ధ‌న్య‌వాదాలు" అని వీడియోలో పేర్కొన్నారు. కాగా జేఈఈ, నీట్ ప‌రీక్ష‌లు ఇప్ప‌టికే రెండు సార్లు వాయిదా పడ్డాయి. ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ ఆల‌స్యం చేసే కొద్దీ విద్యార్థుల భ‌విష్య‌త్తు దెబ్బ‌తింటుంద‌ని కేంద్ర విద్యాశాఖ అభిప్రాయ‌ప‌డుతోంది. (చ‌ద‌వండి: నీట్‌ పరీక్ష వాయిదాకు విపక్ష సీఎంల డిమాండ్‌)

మరిన్ని వార్తలు