‘జనగణమన’ మరిచిపోయి దిక్కులు చూసిన ఎంపీ..!

16 Aug, 2021 15:39 IST|Sakshi

లక్నో: స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమాలు ఆదివారం దేశవ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ వేడుకల్లో పలుచోట్ల అపశ్రుతి, తప్పులు దొర్లాయి. తాజాగా ఓ లోక్‌సభ సభ్యుడు జాతీయ గీతం ‘జనగణమన’ మరచిపోయారు. జెండా ఎగురవేసిన అనంతరం జాతీయ గీతం ఆళపిస్తుండగా ఎంపీ నోరు తిరగలేదు. ఆయనతో పాటు ఆయన అనుచరులు, కార్యకర్తలు కూడా జాతీయ గీతం పాడలేక అవస్థలు ఎదుర్కొన్నారు. కొందరు గీతం మరచిపోయి మధ్యలోనే ఆపివేశారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. 

సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) ఎంపీ ఎస్‌టీ హసన్‌ ఉత్తరప్రదేశ్‌ మొరదాబాద్‌లోని గుల్‌షాహీద్‌ పార్క్‌ సమీపంలో స్వాతంత్ర్య వేడుకలకు హాజరయ్యారు. జెండా ఎగురవేసిన అనంతరం ఎంపీ హసన్‌తో పాటు ఆయన కార్యకర్తలు జనగణమన ప్రారంభించారు. వారు జాతీయ గీతాన్ని.పాడుతూ మధ్యలో మరచిపోయి ఇష్టమొచ్చినట్టు పాడారు. చివరకు జయ జయహే అనేది పూర్తిగా అనకుండానే ముగించారు. ఈ గీతం ఆళపిస్తుండగా ఎంపీ హసన్‌ బిత్తిరిచూపులు చూస్తుండడం వైరల్‌గా మారింది. ఈ సంఘటన రాజకీయ దుమారం రేపింది. ‘ఎంపీ, ఆయన కార్యకర్తలు జాతీయ గీతాన్ని పాడలేకపోయారు. మన నేతల పరిస్థితి ఇలా ఉంది’ అని బీజేపీ సీనియర్‌ నాయకుడు సంబిత్‌ పాత్ర ట్వీట్‌ చేస్తూ ఎద్దేవా చేశారు.
 

మరిన్ని వార్తలు