India's First Cinema Hall: దేశంలోని తొలి సినిమాహాలు ఏది?

7 Oct, 2023 08:08 IST|Sakshi

‘ఈమధ్య మీరు ఏ సినిమా చూశారు?’ ఈ ప్రశ్నకు ప్రతి ఒక్కరి దగ్గరా సమాధానం ఉంటుంది. ఇందులో తేడా ఏమిటంటే ఒక్కొక్కరు ఒక్కో సమాధానం చెబుతారు. మరికొందరు తమ జ్ఞాపకాలను రిఫ్రెష్ చేసుకోవడానికి పాత సినిమాల గురించి ప్రస్తావిస్తారు. మొత్తం మీద దీనికి మంచి సమాధానమే దొరుకుతుంది. అయితే ఇదే సమయంలో దేశంలోనే మొదటి సినిమా థియేటర్ గురించిన వివరాలు తెలిస్తే ఎవరైనా కాసేపు ఆశ్చర్యపోతారు. ఇప్పుడు మనం భారతదేశంలోని మొట్టమొదటి సినిమా థియేటర్ గురించి తెలుసుకోబోతున్నాం.

భారతదేశంలో నిర్మితమైన మొదటి సినిమా థియేటర్ చాప్లిన్ సినిమా. దీనిని ఎల్ఫిన్‌స్టోన్ పిక్చర్ ప్యాలెస్ అని కూడా పిలుస్తారు. ‘చాప్లిన్ సినిమా’ను 1907లో జమ్‌షెడ్జీ రామ్‌జీ మదన్‌ నిర్మించారు. ఆయన మదన్ థియేటర్స్ పేరుతో భారతదేశంలో మొదటి థియేటర్‌ చైన్‌ స్థాపించారు. ‘చాప్లిన్ సినిమా’.. 5/1, చౌరింగ్గీ ప్లేస్, కోల్‌కతా చిరునామాలో ఉండేది. 

జమ్‌షెడ్జీ రామ్‌జీ మదన్‌ను భారతదేశంలో చిత్ర నిర్మాణ పితామహునిగా పిలుస్తారు. మదన్‌ ఎల్ఫిన్‌స్టోన్ డ్రామా క్లబ్‌లో అసిస్టెంట్ బాయ్‌గా ఉద్యోగ జీవితం ప్రారంభించారు. ఈ క్లబ్ ఎంతో విజయవంతమైంది. ప్రపంచవ్యాప్తంగా పర్యటనలు సాగించింది. జమ్‌షెడ్జీ కలకత్తాలో స్థిరపడాలని నిర్ణయించుకున్నాడు. ఆ సమయంలో ప్రసిద్ధ నాటక థియేటర్ అయిన కొరింథియన్ హాల్‌ను కొనుగోలు చేశారు. 1902లో మైదాన్ చుట్టూ బయోస్కోప్ షోలను ఏర్పాటు చేశారు. చివరికి అతని ఆసక్తి సినిమా ప్రదర్శన వైపు మళ్లింది. 1907లో ఎల్ఫిన్‌స్టోన్ పిక్చర్ ప్యాలెస్‌ను ప్రారంభించారు.

ఈ ప్యాలెస్‌కు తరువాతి కాలంలో మినర్వా అనే పేరు పెట్టారు ఇది హాలీవుడ్ చిత్రాలను ప్రదర్శించే ప్రసిద్ధ థియేటర్‌గా మారింది. థియేటర్‌ లాభాలను కాపాడుకునే ప్రయత్నంలో దీనిని చార్లీ చాప్లిన్ పేరు మీద ‘చాప్లిన్ సినిమా’ అనే పేరు పెట్టారు. అయితే ఈ థియేటర్‌ను పలు కారణాలతో 2003లో కూల్చివేశారు.
ఇది కూడా చదవండి: ఫ్రాన్స్‌లో నల్లుల నకరాలు.. జనం పరేషాన్‌!

మరిన్ని వార్తలు