Sudarshan Setu: ‘సుదర్శన్‌ సేతు’ ప్రత్యేకత ఏమిటి?

25 Feb, 2024 07:57 IST|Sakshi

దేశంలో మౌలిక సదుపాయాలకు (ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మార్వెల్) మరో ప్రత్యేక ఉదాహరణ మన కళ్ల ముందుకు వస్తోంది. అదే సుదర్శన సేతు. ఈ వంతెన దేశంలోనే అతి పొడవైన తీగల వంతెన. దీని పొడవు 2.32 కిలోమీటర్లు. దాదాపు రూ.980 కోట్లతో నిర్మించిన ఈ వంతెనను  ప్రధాని నరేంద్ర మోదీ నేడు (ఆదివారం)జాతికి అంకితం చేయనున్నారు. ఈ కేబుల్ వంతెన ఓఖా ప్రధాన భూభాగాన్ని సముద్రం మధ్యలో ఉన్న బేట్ ద్వారకతో అనుసంధానం చేస్తుంది.

ప్రత్యేకమైన డిజైన్‌తో సుదర్శన్ బ్రిడ్జిని రూపొందించారు. బ్రిడ్జికి ఇరువైపులా శ్రీకృష్ణుని చిత్రాలతో అలంకరించారు. ఇందులో ఫుట్‌పాత్ పైభాగంలో సోలార్ ఎనర్జీ ప్యానెళ్లను ఏర్పాటు చేశారు. దీని ద్వారా ఒక మెగావాట్ విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఈ వంతెన ద్వారక- భేట్-ద్వారక మధ్య ప్రయాణించే భక్తుల రాకపోకలను సులభతరం చేయడమే కాకుండా, చాలా సమయాన్ని ఆదా చేస్తుంది.

సుదర్శన్ సేతు నిర్మాణానికి ముందు భేట్ ద్వారక చేరుకోవడానికి ప్రయాణికులు చాలా కష్టపడాల్సి వచ్చేది. పడవపైనే ఆధారపడేవారు. వాతావరణం ప్రతికూలంగా ఉంటే ప్రయాణానికి మరింత జాప్యం జరిగేది. అయితే ఇప్పుడు ఈ ఐకానిక్ వంతెన నిర్మితం కావడంతో భక్తుల కష్టాల తీరనున్నాయి. అలాగే దేవభూమి ద్వారకలో మరో ప్రధాన పర్యాటక ఆకర్షణ అందరినీ అలరించనుంది.

ఈ వంతెన నిర్మాణానికి కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ 2016లో ఆమోదం తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ 2017, అక్టోబర్‌ 7న ఓఖా- భేట్ ద్వారకలను కలిపే వంతెనకు శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.962 కోట్లు కాగా, తర్వాత దానిని రూ.980 కోట్లకు పెంచారు. ఈ వంతెన కారణంగా లక్షద్వీప్‌లో నివసిస్తున్న సుమారు 8,500 మందికి కూడా ప్రయోజనం చేకూరనుంది. 

ఈ వంతెన డెక్ మిశ్రమ ఉక్కు-రీన్ఫోర్స్డ్ కాంక్రీటుతో తయారయ్యింది. దీని వెడల్పు 27.2 మీటర్లు (89 అడుగులు). ఈ వంతెనకు ఇరువైపులా 2.5 మీటర్లు (8 అడుగులు) వెడల్పు గల ఫుట్‌పాత్ కూడా ఉంది. ఈ వంతెన మొత్తం పొడవు 2,320 మీటర్లు (7,612 అడుగులు). ఇది భారతదేశంలోనే అతి పొడవైన తీగల వంతెనగా నిలిచింది. 

whatsapp channel

మరిన్ని వార్తలు