Hyderabad: ‘గ్యాస్‌’ బెనిఫిట్‌.. 10 లక్షల మందికే.. | Sakshi
Sakshi News home page

Hyderabad: ‘గ్యాస్‌’ బెనిఫిట్‌.. 10 లక్షల మందికే..

Published Sun, Feb 25 2024 7:51 AM

10 lakh poor families to benefit from ₹500 LPG scheme - Sakshi

సాక్షి, హైదరాబాద్: సబ్సిడీ వంట గ్యాస్‌ స్కీంకు రేషన్‌కార్డు మెలిక పెట్టడం ఆందోళన కలిగిస్తోంది. ఆహార భద్రత (రేషన్‌) కార్డులు కలిగిన నిరుపేద కుటుంబాలకు మాత్రమే సబ్సిడీ వంట గ్యాస్‌ సిలిండర్లు పొందేందుకు అర్హులని ప్రభుత్వం ప్రకటించింది. అయితే  మహానగర పరిధిలోని గృహోపయోగ వంటగ్యాస్‌ కనెక్షన్‌దారుల్లో సగానికి పైగా కుటుంబాలకు రేషన్‌ కార్డులు లేవు. గత పదేళ్లలో అనేక కుటుంబాల్లోని సభ్యులు వివాహాలతో వేరుపడడం, కొత్త రేషన్‌కార్డులు మంజూరు చేయకపోవడంతో కార్డులు లేని కుటుంబాల సంఖ్య బాగా పెరిగింది. అది కాస్తా సబ్సిడీ వంట గ్యాస్‌ అర్హతకు సమస్యగా తయారైంది.  

10 లక్షల కనెక్షన్లకే సబ్సిడీ వర్తింపు 
గ్రేటర్‌లోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లా పరిధిలో సుమారు 10 లక్షల గ్యాస్‌ కనెక్షన్లకే సబ్సిడీ వంట గ్యాస్‌ వర్తించనుంది. ప్రసుత్తం కేంద్ర ప్రభుత్వ సబ్సిడీ   అధికారికంగా గృహోపయోగ వంట గ్యాస్‌ కనెక్షన్లు కలిగిన సుమారు 30 లక్షల కుటుంబాలకు మాత్రమే నగదుగా బదిలీ అవుతోంది. మరోవైపు ఉపాధి, ఇతరత్రా కోసం వలస వచి్చన కుటుంబాలతో మరో పది లక్షల అనధికార కనెక్షన్లు ఉన్నట్లు అంచనా. ఇటీవల జరిగిన ప్రజాపాలన కార్యక్రమంలో సుమారు 19.01 లక్షల కుటుంబాలు సబ్సిడీ వంట గ్యాస్‌ వర్తింపు కోసం దరఖాస్తు చేసుకున్నాయి. కాగా, అందులో తెల్లరేషన్‌ కార్డులు కలిగిన గ్యాస్‌ కనెక్షన్‌ దారులు కేవలం 10 లక్షల  వరకు మాత్రమే ఉన్నట్లు పౌరసరఫరాల శాఖ అధికారులు గుర్తించి ప్రభుత్వానికి నివేదిక సమరి్పంచారు. దీంతో మిగిలిన వారి పరిస్థితి ప్రశ్నార్ధకంగా తయారైంది. 

ఉజ్వలకు వర్తింపు ? 
ప్రధాన మంత్రి ఉజ్వల కల్యాణ్‌ యోజన పథకం కింద గల కనెక్షన్లకు సబ్సిడీ వర్తింపుపై అయోమయం నెలకొంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఉజ్వల పథకం కింద వంటగ్యాస్‌ కనెక్షన్లు కలిగి ఉన్న కుటుంబాలకు సిలిండర్‌పై రూ.300ల సబ్సిడీ వర్తింపజేస్తోంది. మహానగరం మొత్తం మీద లక్ష వరకు కనెక్షన్లు ఉన్నట్లు ప్రధాన ఆయిల్‌ కంపెనీల లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. ఉజ్వల పథకం ఏడాదికి 12 సిలిండర్లపై సబ్సిడీ వర్తిస్తోంది.  కొత్త పథకం వర్తిస్తే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సబ్సిడీ రెండు విధాలుగా నగదు బదిలీ జమ అవుతుందా? లేక సబ్సిడీ సొమ్ము తగ్గుతుందా? అనేది స్పష్టత లేకుండా పోయింది. 

ప్రస్తుతం సబ్సిడీ ఇలా 
కేంద్ర ప్రభుత్వం గృహోపయోగ వంటగ్యాస్‌ సిలిండర్లపై ప్రస్తుతం రూ.40.17 పైసలు సబ్సిడీ అందిస్తోంది. గత రెండేళ్లుగా వంట గ్యాస్‌ ధరతో సంబంధం లేకుండా  సబ్సిడీలో మాత్రం ఏలాంటి మార్పు లేకుండా వర్తింపజేస్తోంది. వాస్తవంగా వంట గ్యాస్‌ సిలిండర్‌పై వర్తింపజేసే సబ్సిడీ  వినియోగదారుడి బ్యాంక్‌ ఖాతాలోకి నేరుగా జమ చేసే డీబీటీఎల్‌ పథకం 2014 నవంబర్‌ 10న అమల్లో వచి్చంది. వినియోగదారులు గ్యాస్‌ సిలిండర్‌ రీఫిల్‌ కోసం పూర్తి మొత్తాన్ని డెలివరీ సమయంలో చెల్లిస్తే అనంతరం వినియోగదారుల బ్యాంకు ఖాతాలో సబ్సిడీ నగదు జమ జరిగేది. డీబీటీ పథకం అమలు తొలిరోజుల్లో సబ్సిడీ బాగానే వర్తించేంది. తాజాగా సిలిండర్‌ ధరతో నిమిత్తం లేకుండా సబ్సిడీ నగదు జమ రూ 40.71 పైసలకు పరిమితమైంది.

Advertisement
Advertisement