అరుణ్‌పిళ్లైకి 15 కోట్లు ఇచ్చా

7 Apr, 2023 02:59 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: మనీలాండరింగ్‌ కేసులో జైల్లో ఉన్న సుఖేశ్‌ చంద్రశేఖర్‌ మరో సంచలన లేఖ విడుదల చేశారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, ఢిల్లీ మాజీ మంత్రి సత్యేంద్ర జైన్‌ల ఆదేశం మేరకు హైదరాబాద్‌లోని బీఆర్‌ఎస్‌ కార్యాలయంలో రూ.15 కోట్లు ఇచ్చానని అందులో పేర్కొన్నారు. తాను డబ్బులు ఇచ్చింది ఏపీ అలియాస్‌ అరుణ్‌పిళ్లైకి అని స్పష్టం చేశారు. సొమ్ము అందినట్లుగా బీఆర్‌ఎస్‌ నేత చేసిన మెసేజ్‌లకు సంబంధించిన పలు స్క్రీన్‌ షాట్లు తన దగ్గర ఉన్నాయని పేర్కొన్నారు. ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్‌ఎస్‌ నేతకు, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు సత్సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు. కేజ్రీవాల్‌ను ఉద్దేశించి లేఖ రాసిన సుఖేశ్‌ దానిని మీడియాకు విడుదల చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. 

ఇది ఆరంభమే..అసలైంది ముందుంది 
‘రూ.15 కోట్లు మీ (కేజ్రీవాల్‌) ఆదేశాల మేరకే అందించానన్న వివరాలు చాట్‌ రూపంలో స్పష్టంగా ఉన్నాయి. కేజ్రీవాల్, సత్యేంద్ర జైన్‌ సూచించిన టీఆర్‌ఎస్‌ (బీఆర్‌ఎస్‌) నేత కూడా సొమ్ములు అందుకున్నట్లు ధ్రువీకరించారు. లిక్కర్‌ స్కాం కేసులో సౌత్‌గ్రూప్‌కు సంబంధించిన టీఆర్‌ఎస్‌ నేతతో మీ అనుబంధాన్ని చాట్‌ స్పష్టంగా వివరిస్తోంది. రూ.15 కోట్లు అలియాస్‌ 15 కేజీల నెయ్యి ఎవరికి అందించాలో టీఆర్‌ఎస్‌ నేత నిర్దేశించిన విధానం కూడా ఇది వివరిస్తుంది.

ఆ సూచనల మేరకే ఎమ్మెల్సీ స్టిక్కర్‌ ఉన్న బ్లాక్‌ రేంజ్‌రోవర్‌ 6060 నంబరు కలిగిన కారులో నగదు పెట్టెలను అరుణ్‌పిళ్‌లైకు అందజేశా. ఆప్, టీఆర్‌ఎస్, టీఆర్‌ఎస్‌ నేత ఏ విధంగా చేతులు కలిపారో, వ్యక్తిగత స్థాయిలో ఆర్థిక లావాదేవీలు, వ్యాపారాలు ఎలా చేస్తున్నారో కూడా చాట్‌ స్పష్టం చేస్తుంది. నేను విడుదల చేస్తున్న ఈ వాట్సాప్‌ చాట్‌ స్క్రీన్‌ షాట్లు ప్రారంభం మాత్రమే. అసలైంది ముందుంది. టీజర్‌ కోసం సహచరులతో కలిసి వేచి ఉండండి.  

మీ అందరితో కలిసి నార్కో పరీక్షలకు సిద్ధం 
నాపై ఏ కేసు రుజువు కానందున ఎలాంటి వ్యాఖ్యలు చేయకండి.  మీ అవినీతి బృందం.. సమస్యను దారి మళ్లించడానికి నా విశ్వసనీయత గురించి మాట్లాడుతోంది. నేను మీ అందరితో కలిసి నార్కో పరీక్షలకు సిద్ధంగా ఉన్నా. 2015–2023 వరకు ప్రతి ప్రకటనకు నా దగ్గర ఆధారం ఉంది. కౌంట్‌డౌన్‌ ప్రారంభమైంది. అన్నింటికీ సిద్ధంగా ఉండండి. టీజర్‌ స్క్రీన్‌ షాట్‌–1 విడుదలైన తర్వాత మీరు, మీ స్నేహితుల ఏడుపులు, నిందలు చూడడానికి చాలా ఉత్సుకతతో ఉన్నా. కేజ్రీవాల్‌ జీ మీ కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఓ నినాదం నా దగ్గర ఉంది. అద్భుతమైన సంగీత బృందంతో సంగీతం కంపోజ్‌ చేయిస్తున్నా..’ అని సుఖేశ్‌ పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు