ప్రసార మాధ్యమాలపై సుప్రీం వ్యాఖ్యలు ఆలోచించదగినవే

16 Jan, 2023 14:46 IST|Sakshi

టీవీ ప్రసార మాద్యమాలపై సుప్రీంకోర్టు చేసిన తీవ్ర వ్యాఖ్యలు ఆలోచించదగినవే. కచ్చితంగా టీవీ చానళ్లు బాధ్యతగా ఉండాలి. సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉండరాదు. ఈ సూత్రం ఒక్క టీవీ చానళ్లకే కాదు.. అన్ని వ్యవస్థలకు వర్తిస్తుంది. గౌరవ న్యాయ స్థానం ఆ విషయాన్ని గుర్తించే ఇంత ఆవేదనగా తన వ్యాఖ్యలు చేసినట్లు కనిపిస్తుంది. అయితే అదే సమయంలో కొన్నిసార్లు ప్రభుత్వాలు విద్వేషపూరిత ప్రసంగాలు చేసినవారిపై , వారి ప్రసంగాలను విస్తారంగా ప్రచారం చేసిన చానళ్లపై కేసులు పెడితే న్యాయ వ్యవస్థ స్టే లు ఇవ్వడమో, లేక మరో రకంగానో వారికి రక్షణ కల్పించాయన్న విమర్శలు కూడా లేకపోలేదు.  ఒక్కోసారి ఒక్కో  గౌరవ న్యాయమూర్తి ఒకో రకంగా స్పందించడం కాకుండా , ఇలాంటి విషయాలలో ఒకే అభిప్రాయం వ్యక్తం అయ్యేలా వ్యవస్థ వ్యవహరిస్తే అప్పుడు దేశానికి ఒక మార్గదర్శకం అవుతుందని చెప్పాలి. సందర్భం ఏదైనా సుప్రీంకోర్టు ఇప్పుడు విద్వేష సమస్యను మరోసారి తెరపైకి తెచ్చింది. 

టీవీ చానళ్లను బలమైన దృశ్యమాద్యమంగా మారాయని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. అది వాస్తవమే. అందులోను పాజిటివ్ సమాచారం కన్నా, నెగిటివ్ సమాచారానికే ఎక్కువ ప్రాధాన్యత వస్తుంది. వాటికి టిఆర్పి రేటింగ్ ముడిపడి ఉండడంతో ఆయా చానళ్లు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాయన్న విమర్శలు లేకపోలేదు. అందులో భాగంగా అశ్లీల నృత్యాలు, విద్వేషపూరిత  ప్రసంగాలు, చర్చలు వంటివి ఉంటున్నాయి. కచ్చితంగా వీటిని అడ్డుకోవల్సిందే. అందుకోసం ఏమి చేయాలన్నదానిపై కొన్ని మార్గదర్శక సూత్రాలు లేకపోలేదు. కానీ వాటిని కొంతమంది పట్టించుకోవడం లేదు. దాంతోనే ఈ సమస్య వస్తోంది.దానికి మీడియా స్వేచ్చ అనే ముసుగు తగిలిస్తున్నారు.కచ్చితంగా మీడియా స్వేచ్చను కాపాడాల్సిందే. అలాగే వారు ఏదైనా విద్వేషాన్ని పెంచుతుంటే దానిని అరికట్టవలసిందే. కానీ కొన్నిసార్లు న్యాయ  వ్యవస్థ పూర్తి వివరాలలోకి వెళ్లకముందే విద్వేష వ్యాప్తి చేశారన్న ఆరోపణలు ఉన్నవారికి  రక్షణ కల్పిస్తోందన్న అభిప్రాయం ఉంది. పైగా ఆ సమయాలలో కొందరు న్యాయమూర్తులు పోలీసు వ్యవస్థపైన , ప్రభుత్వాలపైన తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. దాంతో అసలు సమస్య పక్కకుపోయి, ఈ తీవ్ర వ్యాఖ్యలే చర్చనీయాంశం అవుతున్నాయి. ఉదాహరణకు ఆంద్ర ప్రదేశ్ లో ఒక ఎమ్.పిగారు రోజూ విద్వేషపూరిత ప్రసంగాలు చేస్తుండేవారు.

కొన్ని కులాలను కించపరిచేలా మాట్లాడడం, కొన్ని మతాలను అగౌరవపరచేలా సంభాషించడం చేసేవారు. దానిని కొన్ని చానళ్లు నియంత్రించకపోగా, చాలా గొప్ప విషయం అన్నట్లుగా ప్రసారం చేసేవి.ఈ నేపధ్యంలో పోలీసులు సంబందిత రికార్డు అంతటిని తయారు చేసి కేసు పెడితే న్యాయ వ్యవస్థ స్పందించిన తీరు అందరిని ఆశ్చర్యపరిచింది. సదరు ఎమ్.పిగారు తనను పోలీసులు కొట్టారని ఆరోపించారు. ఆయనను నిజంగా కొట్టారో, లేదో తేల్చాలని గౌరవ సుప్రింకోర్టువారు ఆర్మి ఆస్పత్రికి పంపించారు. ఆ ఆస్పత్రిలో చేరిన కొద్ది రోజులకు ఆయన చెప్పాపెట్టకుండా బయటకు వెళ్లిపోయారు.అయినా న్యాయ వ్యవస్థ ఆయనపై చర్య తీసుకోలేదు. పోలీసులు ఆయనపై రాజద్రోహం కేసు పెడతారా అంటూ ఫైర్ అయింది. దాని సంగతి తేల్చేస్తామని చెప్పారు. అదీ జరగలేదు.గౌరవ కోర్టువారు ఎపి ప్రభుత్వ ఆస్పత్రులు ఇచ్చిన నివేదికలను పరిశీలించిన తర్వాత , ఇమేజీలను అబ్జర్వు చేసిన తర్వాత తగు నిర్ణయం చేసినట్లు అనిపించలేదు. అయినా ఫర్వాలేదు. ఒకవేళ పోలీసులు ఏమైనా తప్పు చేసి ఉంటే చర్య తీసుకోవచ్చు. కాని అలా కాకుండా ఆ కేసు పక్కదారి పట్టేలా సాగితే మరి ఎవరిని తప్పు పట్టాలి. ఇప్పటికీ ఆ కేసు ఒక కొలిక్కి రాలేదు. 

చివరికి  ఆ ఎంపీగారు ఆ రాష్ట్రానికి వెళ్లడం మానుకున్నారు. పైగా పోలీసుల విచారణకు కూడా హాజరు కాకుండా తప్పించుకుని తిరుగుతున్నారు. దానికి తోడు ప్రతిపక్షం పోలీసులపై , ప్రభుత్వం లేనిపోని ఆరోపణలు చేస్తుంటుంది. దానికి న్యాయవ్యవస్థ తీసుకున్న కొన్ని నిర్ణయాలే కారణం. ఈ విషయాన్ని కూడా గౌరవ న్యాయమూర్తులు పరిశీలించవలసిన అవసరం ఉంది. విద్వేషపూరిత ప్రసారాల విషయంలో ముందుగా రాజద్రోహం సెక్షన్లు వర్తిస్తాయా?లేదా? ఒకవేళ వర్తించకపోతే, మరే సెక్షన్ కిందకేసు పెట్టాలి?అన్నది  తేల్చిన తర్వాత సుప్రింకోర్టు ఈ విషయంలో ముందుకు వెళితే బాగుంటుందనిపిస్తుంది.

ఈ  ఎంపీగారి కేసులో విద్వేషపూరిత ప్రసంగాన్ని, దానిని ప్రసారం చేసిన చానళ్లను ఒక కేసు కింద, ఒకవేళ పోలీసులు ఆ ఎంపీని హింసించి ఉంటే దానిని విడిగా మరో కేసు కింద పరిగణించి విచారణ చేపట్టి ఉంటే న్యాయ వ్యవస్థపై విశ్వాసం పెరిగేది. కొన్నిసార్లు  కొందరు న్యాయమూర్తులు తమ సొంత అభిప్రాయాలను యధేచ్చగా వ్యక్తం చేస్తున్నారు. అవి ఒక్కోసారి రాజకీయ వ్యాఖ్యల మాదిరిగా ఉంటున్నాయి. అలాంటి స్వేచ్చ న్యాయమూర్తులకు ఉండవచ్చు.కాని వాటివల్ల కూడా రాజకీయంగా కొందరికి ప్రయోజనం కలిగేలా ఉండడం సరైనదేనా అన్నది ఆలోచించాలి. అలాకాకుండా వారు ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేసినా,దానిని లిఖిత పూర్వక తీర్పులో ఉండాలన్న డిమాండ్ ను కొన్ని పక్షాలు చేస్తున్నాయి.

కానీ న్యాయమూర్తులు వాటిని పట్టించుకోకుండా, తమ మానాన తాము రాజకీయ వ్యాఖ్యలు చేస్తున్నారు. దీని ప్రభావం కూడా సమాజంపై పడే అవకాశం ఉంటుంది. ప్రభుత్వాలు తప్పు చేసినప్పుడు కచ్చితంగా న్యాయ వ్యవస్థ తగురీతిలో స్పందించాలి. అలాగని ప్రతి విషయంలోను జోక్యం చేసుకుంటోందన్న అబియోగానికి తావివ్వకూడదు. ఏది ఏమైనా సుప్రింకోర్టు విద్వేషవ్యాప్తిని అరికట్టడానికి ప్రస్తుతం చొరవ చూపడం మంచిదే. కొన్నిసార్లు భావ స్వేచ్చగాను, మరికొన్నిసార్లు విద్వేషంగాను పరిగణించకుండా, ఒక కొలమానాన్ని అనుసరించవలసిన అవసరం ఉంది.అందుకు తగ్గ ప్రమాణాలను న్యాయ వ్యవస్థ రూపొందిస్తే మంచిది. ఎన్నో కీలకమైన సంస్కరణలకు, మార్పులకు సుప్రింకోర్టు గతంలో నాందీ పలికింది. ఇప్పుడు ఈ విద్వేష వ్యాప్తిని అరికట్టడానికి వీలుగా తగు సంస్కరణలు తీసుకువస్తే సంతోషించవచ్చు. కచ్చితంగా సమాజాన్ని చీల్చి, విద్వేషాలను పెంచి లాభపడాలన్న వ్యక్తులు,  రాజకీయ నేతలకు, టీవీ చానళ్లకు ముకుతాడు వేయగలిగితే ఆహ్వానించదగిన పరిణామమే అవుతుంది.

మరిన్ని వార్తలు