సీఎంతో సమావేశమై పరిష్కరించుకోండి: గవర్నర్​కు సుప్రీం సూచన

1 Dec, 2023 14:57 IST|Sakshi

న్యూఢిల్లీ/చెన్నై: తమిళనాడు ప్రభుత్వం, గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవికి మధ్య నెలకొన్న వివాదం రోజురోజుకీ మరింత ముదురుతోంది. అసెంబ్లీ తీర్మానించిన బిల్లులను గవర్నర్‌ ఆమోదించడంలో జాప్యం చేస్తున్నారంటూ స్టాలిన్‌ ప్రభుత్వం  గత కొంతకాలంగా ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా తమిళనాడు బిల్లుల ఆమోదంలో జాప్యంపై నెలకొన్న ప్రతిష్టంభనను ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌తో సమావేశమై పరిష్కరించాలని తమిళనాడు గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవిని సుప్రీంకోర్టు ఆదేశించింది.

ఈ మేరకు తమిళనాడు ప్రభుత్వం దాఖలుచేసిన పిటిషన్​పై సుప్రీంకోర్టు శుక్రవారం విచారించింది. బిల్లుల విషయంలో నెలకొన్న ప్రతిష్టంభనను గవర్నర్​ పరిష్కరించాలని కోరుతున్నట్లు సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. ముఖ్యమంత్రిని ఆహ్వానించి ఇరువురు కూర్చొని చర్చిస్తారని భావిస్తున్నట్లు తెలిపింది. 

అసెంబ్లీ తిరిగి ఆమోదించిన 10 బిల్లులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు గవర్నర్ రిఫర్ చేశారని రాష్ట్ర ప్రభుత్వం తరఫు సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ అత్యున్నత న్యాయస్థానానికి తెలియజేసిన నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. అసెంబ్లీ తిరిగి ఆమోదించిన బిల్లులు రాష్ట్రపతికి రిజర్వ్ చేయకూడదన్న విషయాన్ని గవర్నర్ గమనించాలని జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. తదుపరి విచారణను డిసెంబర్​ 11కు వాయిదా వేసింది.

ఇటీవల రాష్ట్ర అసెంబ్లీ తీర్మానించిన 10 బిల్లులను ఆమోదించకుండా గవర్నర్‌ వెనక్కి పంపారు. ఈ నేపథ్యంలో ఆర్‌ఎన్‌ రవి చర్యపై తమిళనాడు ప్రభుత్వం శనివారం ప్రత్యేక అసెంబ్లీ సమావేశం నిర్వహించింది.  ఎలాంటి కారణాలు చెప్పకుండా గవర్నర్‌ తిప్పి పంపిన 10  బిల్లులను మరోసారి అసెంబ్లీ  ఏకగ్రీవంగా ఆమోదించింది. ఆమోదం పొందిన బిల్లులలో 2020, 2023లో అసెంబ్లీ తీర్మానించిన రెండేసి బిల్లులు ఉండగా.. మరో ఆరు బిల్లులు 2022లోనే ఆమోదించినవి ఉన్నాయి. వీటిని గవర్నర్ ఆమోదం కోసం తిరిగి పంపారు.

మరిన్ని వార్తలు