చెన్నైలో కుండపోత వర్షాలు.. స్కూళ్లు బంద్​.. వాతావరణశాఖ హెచ్చరికలు

30 Nov, 2023 12:57 IST|Sakshi

చెన్నై: తమిళనాడులోని చెన్నైతో సహా పలు జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడుతున్నాయి. వరదనీటితో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఎక్కడ చూసిన వర్షపు నీరే దర్శనమిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా చెన్నైలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. 

భారీ వర్షాల నేపథ్యంలో చెన్నై, చెంగల్​పట్టు, రాణిపేట్​, కంచిపురం జిల్లాలలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు బుధవారం విద్యాశాఖ అధికారులు సెలవులు ప్రకటించారు. అదే విధంగా తిరువళ్లూర్​లోని స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించారు. చెన్నైతోపాటు పలు జిల్లాల్లో బుధవారం రాత్రి కూడా భారీ వర్షం నమోదైంది. చెన్నై, కాంచీపురం, తిరువళ్లూర్​లోని అనేక వీధులు దాదాపు మోకాళ్ల లోతు నీటితో నిండిపోయాయి.  వర్షానికి సంధించిన దృశ్యాలు సోషల్​ మీడియాలో వైరల్​గా మారాయి. 

డిసెంబర్ 2, 3 తేదీల్లో తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్‌లలో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణశాఖ అంచనా వేసింది. ఈ మేరకు ఆ తమిళనాడులోని 25 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.  వాతావరణశాఖ జారీ చేసిన తుఫాను హెచ్చరికల నేపథ్యంతో అరక్కోణం పట్టణంలో ఎన్డీఆర్​ఎఫ్​ బృందాలను మోహరించారు.

వర్షాలు మరింత పెరిగే అవకాశం ఉండటంతో అనేక ప్రాంతాలకు వరద ముప్పు పొంచి ఉందని, అత్యవసర సర్వీసుల సిబ్బంది హై అలర్ట్​గా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ప్రజలంతా ఇళ్లల్లోనే ఉండాలని తప్పనిసరి అయితే తప్ప బయటకు రావొద్దని చెప్పారు. 

మరిన్ని వార్తలు