సుప్రీంకోర్టులో ప్రశాంత్‌ భూషణ్‌కు మరో ఎదురుదెబ్బ

20 Aug, 2020 13:13 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : సుప్రీంకోర్టులో ప్రముఖ​ న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్కు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. కోర్టు ధిక్కార కేసు విచారణను వాయిదా వేయాలని కోరుతూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను ధర్మాసనం తిరస్కరించింది.సుప్రీంకోర్టు, ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌ఏ బాబ్డే ప్రతిష్టకు భంగం కలిగేలా ట్వీట్లు చేసినందుకు అత్యున్నత న్యాయస్థానం ఆయనను దోషిగా తేలుస్తూ శుక్రవారం(ఆగస్టు 14) తీర్పు చెప్పిన విషయం తెలిసిందే.
(చదవండి : ధిక్కారం కేసులో ప్రశాంత్‌ భూషణ్‌ దోషే)

ఈ రోజు (ఆగస్టు 20) శిక్ష ఖరారు చేయనున్న నేపథ్యంలో  ఈ తీర్పును ఆయన సవాల్ చేస్తూ రివ్యూ పిటీషన్ దాఖలు చేశారు. మరొక బెంచ్‌తో శిక్ష ఖరారు చేయించాలని విజ్ఞప్తి చేశారు. దీనిని సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఇది సముచితమైన కోరిక కాదని, శిక్ష విధించిన తర్వాతే తీర్పు పూర్తవుతుందని తేల్చి చెప్పింది. శిక్ష ఖరారును వాయిదా వేయలేమని స్పష్టం చేసింది. ప్రశాంత్ భూషణ్‌పై దాఖలైన కోర్టు ధిక్కార కేసులో ఆయనకు విధించాల్సిన శిక్షపై దేశ అత్యున్నత న్యాయస్థానం ఈ రోజు నిర్ణయం తీసుకోనుంది. గరిష్టంగా ఆయనకు 6నెలల జైలు శిక్ష, రూ.2 వేల జరిమానా విధించే అవకాశాలున్నాయి. 

మరిన్ని వార్తలు