నేవీ నారీ శక్తి ఘనత 

5 Aug, 2022 04:59 IST|Sakshi

అరేబియా సముద్రంపై మహిళా అధికారుల నిఘా విధులు 

లెఫ్టినెంట్‌ కమాండర్‌ ఆంచల్‌ శర్మ నేతృత్వంలో సరికొత్త రికార్డు 

న్యూఢిల్లీ: పూర్తిగా మహిళా అధికారులతో కూడిన నావికాదళ బృందం ఉత్తర అరేబియా సముద్రంపై నిఘా మిషన్‌ను సొంతంగా నిర్వహించిన అరుదైన ఘనత సాధించింది. పోర్బందర్‌లోని ‘ఐఎన్‌ఏఎస్‌ 314’కు చెందిన మహిళా అధికారుల ఫ్రంట్‌లైన్‌ నేవల్‌ ఎయిర్‌ స్క్వాడ్రన్‌ బుధవారం ఈ చరిత్ర సృష్టించిందని నేవీ తెలిపింది.

లెఫ్టినెంట్‌ కమాండర్‌ ఆంచల్‌ శర్మ సారథ్యంలోని ఈ బృందంలో పైలెట్లు లెఫ్టినెంట్‌ శివాంగి, లెఫ్టినెంట్‌ అపూర్వ గీతె, టాక్టికల్, సెన్సార్‌ ఆఫీసర్లు లెఫ్టినెంట్‌ పూజా పాండా, సబ్‌ లెఫ్టినెంట్‌ పూజా షెకావత్‌ ఉన్నారని వెల్లడించింది. వీరంతా అత్యాధునిక డోర్నియర్‌ విమానం ద్వారా నిఘా విధులు నిర్వర్తించారని నేవీ ప్రతినిధి కమాండర్‌ వివేక్‌ మధ్వాల్‌ తెలిపారు.

వీరు చేపట్టిన మొట్టమొదటి మిలిటరీ ఫ్లయింగ్‌ మిషన్‌ ప్రత్యేకమైందని, వైమానిక దళంలోని మహిళా అధికారులు మరిన్ని బాధ్యతలను స్వీకరించడానికి, మరిన్ని సవాళ్లతో కూడిన విధులను చేపట్టేందుకు మార్గం సుగమం చేస్తుందని కమాండర్‌ మధ్వాల్‌ అన్నారు. ‘ఈæ మిషన్‌ సాయుధ దళాలు సాధించిన ఒక ప్రత్యేక విజయానికి సూచిక’అని ఆయన అన్నారు. ఈ మిషన్‌ నారీ శక్తిలో నిజమైన స్ఫూర్తిని నింపుతుందని ఆయన పేర్కొన్నారు.   

మరిన్ని వార్తలు