టీచర్‌ సులోచన కేసులో వీడిన మిస్టరీ.. గాయత్రి భర్తతో రిలేషనే కారణం!

5 Aug, 2022 04:51 IST|Sakshi

మైసూరు: సుమారు 6 నెలల కిందట మైసూరు జిల్లాలోని నంజనగూడు పట్టణంలో జరిగిన వసతి పాఠశాల ఉపాధ్యాయురాలు సులోచన (45) హత్య కేసు మిస్టరీ వీడిపోయింది. నంజనగూడు నగరసభ సభ్యురాలితో పాటు నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. 

స్థానిక మొరార్జి దేశాయి వసతి పాఠశాల హిందీ టీచర్‌ సులోచన మార్చి నెల 9వ తేదీన దారుణ హత్యకు గురైంది. అప్పటి నుంచి హంతకుల ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. ఎట్టకేలకు నగరసభ సభ్యురాలు గాయత్రి మురుగేశ్‌, ఆమె బంధువు భాగ్య, నాగమ్మ, కుమార్‌లను పోలీసులు అరెస్టు చేశారు. ఈ హత్యకు అక్రమ సంబంధమే కారణమని వెల్లడైంది.  

తన భర్తతో సన్నిహితంగా ఉందని..  
సులోచన భర్త నాలుగు సంవత్సరాల క్రితం మృతి చెందాడు. ఇక గాయత్రి భర్త మురుగేష్‌ శ్రీకంఠేశ్వర దేవాలయంలో డి గ్రూప్‌ ఉద్యోగిగా పనిచేస్తుంటాడు. ఇతనికి, టీచర్‌కు మధ్య అక్రమ సంబంధం ఏర్పడింది. ఇద్దరూ కలిసి ఉండడం అనేకసార్లు గాయత్రి గమనించి కసితో రగిలిపోయింది. తన భర్తను కలవవద్దని గాయత్రి  టీచరమ్మను హెచ్చరించినప్పటికీ తీరు మారలేదు. దీంతో శాశ్వతంగా అడ్డు తొలగించుకోవాలనుకుంది. నంజనగూడులోనే అద్దె ఇంట్లో సులోచన ఉండేది. మరో ముగ్గురి సహకారంతో సులోచన ఇంటికి వెళ్లి ఆమెను గొంతు పిసికి చంపి హత్య చేసినట్లు గాయత్రి ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు. సులోచనకు ఒక పెళ్లయిన కూతురు, బెంగళూరులో ఉద్యోగం చేసే కొడుకు ఉన్నారు.

ఇది కూడా చదవండి: అర్పిత 31 ఎల్‌ఐసీ పాలసీల్లో నామినీగా పార్థ ఛటర్జీ!

మరిన్ని వార్తలు