రిటైర్మెంట్‌ ప్రకటించిన కాంగ్రెస్ సీనియర్ నేత

25 Oct, 2023 12:09 IST|Sakshi

యూపీఏ- 2 హయాంలో హోం మంత్రిగా పనిచేసిన కాంగ్రెస్ సీనియర్ నేత సుశీల్ కుమార్ షిండే రిటైర్మెంట్ ప్రకటించారు. తన బదులు తన కుమార్తె ప్రణితి షిండే వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో షోలాపూర్ నుండి పోటీ చేస్తారని ఆయన ప్రకటించారు. 

సుశీల్ కుమార్ శంభాజీ షిండే 1941, సెప్టెంబర్ 4న మహారాష్ట్రలో జన్మించారు. షిండే కాంగ్రెస్ పార్టీ నేతగా పలు కీలక పదవులు చేపట్టారు. 2003లో తొలిసారి మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎ‍న్నికయ్యారు. 2004 వరకు ఈ పదవిలో ఉన్నారు. అనంతరం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా వ్యవహరించారు. 2006 వరకు ఈ పదవిలో కొనసాగారు. సుశీల్ కుమార్ షిండే 2006 నుండి 2012 వరకు కేంద్ర ఇంధనశాఖ మంత్రిగా పనిచేశారు. 2012లో హోం మంత్రిగా నియమితులయ్యారు. 2014 వరకు ఈ పదవిలో ఉన్నారు. 

1971లో కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వం తీసుకోవడంతో క్రియాశీల రాజకీయాల్లో షిండే కెరీర్ ప్రారంభమైంది. 1974 నుండి 1992 వరకు మహారాష్ట్ర శాసనసభలో సభ్యునిగా ఉన్నారు. 1992 నుండి మార్చి 1998 వరకు రాజ్యసభ సభ్యునిగా ఉన్నారు. 1999లో ఆయన ఉత్తరప్రదేశ్‌లోని అమేథీలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి ప్రచార నిర్వాహకునిగా బాధ్యతలు నిర్వహించారు.

షిండే రిటైర్మెంట్ ప్రకటనతో ఆయన కుమార్తె ప్రణితి షిండే(42) తన తండ్రి సంప్రదాయ సీటు బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆమె షోలాపూర్ నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీకి ప్రత్యేక ఆహ్వానిత సభ్యురాలుగా ఉన్నారు. ఈసారి షోలాపూర్ ఎంపీ స్థానం కాంగ్రెస్‌కే దక్కుతుందని ప్రణితి ఆశాభావం వ్యక్తం చేశారు. 
ఇది కూడా చదవండి: డబుల్‌ ఇంజిన్‌ సర్కారులో డబుల్‌ అనారోగ్యం: ఖర్గే

మరిన్ని వార్తలు