Sakshi News home page

హామీలను నెరవేర్చిన..  పార్టీలకే ఓటేయాలి

Published Sun, Oct 15 2023 2:59 AM

telangana assembly elections 2023: Highlights of FGG Manifesto - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ‘మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల­ను నెరవేర్చిన పార్టీలకు, మంచి చేస్తారనే అభ్య­ర్థులకే ఓటేయాలి. అధికారంలోకి రావడం కోసం అనేక వాగ్దానాలు చేస్తుంటారు. కానీ అవి అమల­య్యే హామీలా? కాదా? అనేది చూడాలి. అలాగే ఇంతకుముందు ఇచ్చిన హామీలను ఏ మేరకు అమలు చేశారో చూడాలి. పార్టీలిచ్చే హామీలు రాష్ట్ర బడ్జెట్‌­ను మించిపోతున్నాయి. కొన్ని పార్టీల మేనిఫెస్టోలు ఉత్తుత్తవిగా ఉంటున్నాయి’ అని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. శనివారం హైదరాబాద్‌ ప్రెస్‌క్లబ్‌లో ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ (ఎఫ్‌జీజీ) ‘ప్రజల మేనిఫెస్టో–2023’ని విడుదల చేసింది.

ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డి, హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ రామలింగేశ్వరరావు, ఎఫ్‌జీజీ అధ్యక్షుడు పద్మనాభరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ ‘ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ప్రజలకు ప్రజాస్వా­మ్యంపై నమ్మకం పోయేలా ఉంది. పార్టీలు చట్టాల పరిధిలో లేక తామే ఒక చట్టంగా వ్యవహరిస్తు­న్నాయి. గెలిచిన పార్టీలు అంతా తమదే అనుకుంటున్నాయి.

మార్పు కోసం రాజ్యాం­గ సంస్కరణలు రావాలి’ అని చెప్పారు. ఎఫ్‌జీజీ అధ్యక్షుడు పద్మనా­భరెడ్డి మాట్లాడుతూ ‘మా ఓటు అమ్మకానికి లేదు. మద్యం, డబ్బు సంచులతో రావద్దు’ అని ఓటర్లు నినదించాలన్నారు. జస్టిస్‌ రామలింగేశ్వరరావు మా­ట్లా­డుతూ.. పార్టీలు రకరకాల తాయిలాలతో విడు­దల చేసే మేనిఫెస్టులు చిత్తు కాగితాలతో సమాన­మని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో కార్యద­ర్శి సోమా శ్రీనివాస్‌రెడ్డి తదిరులు పాల్గొన్నారు.

ఎఫ్‌జీజీ మేనిఫెస్టోలోని ముఖ్యాంశాలు.. 

  • రాష్ట్ర బడ్జెట్‌లో విద్య, ఆరోగ్యానికి 25 శాతం నిధులు కేటాయించాలి. 
  • సంక్షేమ పథకాలకు బడ్జెట్‌లో 30 శాతానికి మించకుండా కేటాయించాలి.
  • పెట్రోలు, డీజిల్‌పై ట్యాక్స్‌ తగ్గించాలి.
  • రైతుబంధు పది ఎకరాల్లోపు రైతులకే ఇవ్వాలి. కౌలు రైతులకూ రైతుబంధు ఇవ్వాలి. 
  • పంటల బీమా అమలు చేయాలి. వ్యవసాయానికి ఉచిత విద్యుత్, మూడు బోర్ల వరకు పరిమితి విధించాలి.
  • నీటి పారుదల ప్రాజెక్టులపై ఒక ఉన్నత కమిటీ ఉండాలి.
  • ప్రభుత్వ పనితీరు పారదర్శకంగా, జవాబుదారీతనంతో ఉండాలి. అవినీతికి అడ్డుకట్ట వేయాలి.
  • లోకాయుక్త చట్టాన్ని కర్ణాటకలో మాదిరిగా సవరించాలి.
  • కేంద్రంతో రాష్ట్రం మంచి సంబంధాలు కలిగి ఉండాలి. 
  • పాఠశాలలు, కాలేజీలు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయాలి. 
  • దశల వారీగా మద్యనిషేధాన్ని అమలు చేయాలి. మాదక ద్రవ్యాలను ఉక్కుపాదంతో అణచివేయాలి. 
  • పార్టీలు తమ మేనిఫెస్టోలో చెప్పిన పథకాలకయ్యే వ్యయం వివరిస్తూ, ఆ డబ్బు ఎక్కడి నుంచి వస్తోందో కూడా తెలపాలి.
  • ఆహార కల్తీపై గట్టి నిఘా ఉండాలి. నైపుణ్యం, ఉపాధి పెంచాలి.
  • సీఎం, మంత్రులు, ప్రజా ప్రతినిధులు తమ ఆస్తి వివరాలు వెల్లడించాలి.
  • మహిళలకు 25శాతం టికెట్లు కేటాయించాలి. 
  • నేర చరిత్రులకు టికెట్‌ ఇవ్వొద్దు.
  • ప్రభుత్వ భూముల అమ్మకంపై నిషేధం విధించాలి. ధరలపై నియంత్రణ ఉండాలి. 
  • గల్ఫ్‌ కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి. క్రీడలకు ప్రోత్సాహం ఇవ్వాలి. 

Advertisement

What’s your opinion

Advertisement