‘మిఠాయి దౌత్యం’.. స్వీట్లు పంచుకున్న భారత్‌, పాక్‌

21 Jul, 2021 16:18 IST|Sakshi
పంజాబ్‌: వాఘా సరిహద్దులో సైనికుల పరస్పర శుభాకాంక్షలు

సాక్షి, న్యూఢిల్లీ: రెండు దేశాల మధ్య ఉన్న సరిహద్దుల్లో పండుగలు, ప్రత్యేక రోజుల్లో ఇరు దేశాల భద్రతా సిబ్బంది కలిసిపోతారు. ప్రత్యేక దినాల్లో ఇరు సైనికులు స్నేహాభావంతో మిఠాయిలు ఇచ్చిపుచ్చుకుంటారు. తాజాగా బక్రీద్‌ పర్వదినం సందర్భంగా దేశ సరిహద్దుల్లో ఉన్న సైనికులు కూడా పండుగ చేసుకున్నారు. ఇరు దేశాల సైనికులు మిఠాయిలు ఇచ్చిపుచ్చుకున్నారు.

ఒకరినొకరు శుభాకాంక్షలు తెలుపుకుని ఆనందంలో మునిగారు. పూంచ్‌- రావల్‌కోట్‌ సరిహద్దు వద్ద ఉన్న భారత్‌ పాక్‌ సైనికులు ‘మిఠాయి దౌత్యం’ నిర్వహించారు. ఇటు పశ్చిమ బెంగాల్‌లోని బంగ్లాదేశ్‌ సరిహద్దులో కూడా ఇరు దేశాలు సైనికులు మిఠాయి దౌత్యం చేపట్టారు. ఇక పంజాబ్‌లోని వాఘా సరిహద్దులో కూడా ఈ కార్యక్రమం నిర్వహించారు.

పండుగ సందర్భంగా మిఠాయిలు ఇచ్చిపుచ్చుకుని మిఠాయి దౌత్యం నిర్వహించామని పూంచ్‌లోని భారత లెఫ్టినెంట్‌ కమాండర్‌ దేవేందర్‌ ఆనంద్‌ తెలిపారు. జమ్మూలోని అంతర్జాతీయ సరిహద్దు వద్ద మిఠాయిలతో పాటు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని బీఎస్‌ఎఫ్‌ జవాన్లు, పాక్‌ రెసిడెంట్లు మార్చుకున్నట్లు వివరించారు. ఇలాంటి వాటితో రెండు దేశాల మధ్య స్నేహం, విశ్వాసాన్ని పెంచుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. గతంలో కూడా ఇలాంటి మిఠాయి దౌత్యం నిర్వహించారు.

పూంచ్‌ జిల్లాలోని సరిహద్దులో మిఠాయిలు ఇచ్చిపుచ్చుకుంటున్న ఇరు దేశాల సైనికులు (ఫొటో: హిందూస్తాన్‌ టైమ్స్‌)

మరిన్ని వార్తలు