పంటనష్టంలో తెలంగాణది మూడోస్థానం 

20 Aug, 2023 06:10 IST|Sakshi

కేంద్ర హోంశాఖ పరిధిలోని విపత్తు నిర్వహణ విభాగం వెల్లడి

సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కురుస్తున్న వర్షాల కారణంగా సుమారు 12 లక్షల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లినట్లు కేంద్ర హోంమంత్రిత్వశాఖ పరిధిలోని విపత్తు నిర్వహణ విభాగం వెల్లడించింది. వరదలు, పిడుగుపాట్లు వంటి కారణాలతో 2,044 మంది మరణించినట్లు తెలిపింది. వరదలతో అత్యధికంగా హరియాణాలో 5,40,975 ఎకరాల్లో పంటనష్టం జరగ్గా, హిమాచల్‌ప్రదేశ్‌లో 1,89,400 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు నివేదించింది.

అత్యధికంగా పంటనష్టం జరిగిన రాష్ట్రాల్లో తెలంగాణ మూడోస్థానంలో ఉందని, మొత్తం 1,51,970 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని పేర్కొంది. తెలంగాణలో 18 మంది మరణించారని, ఇతరత్రా కారణాలతో మరొకరు మృతి చెందారని నివేదికలో వెల్లడించింది. ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు రెండు విపత్తు నిర్వహణ బృందాలను రాష్ట్రంలో సిద్ధంగా ఉంచినట్లు తెలిపింది.  

ఏపీలో 22,537 ఎకరాల్లో పంట నష్టం ఏపీలోని ఐదు జిల్లాల పరిధిలో భారీవర్షాలు, వరదల ప్రభావం ఉందని, వాటి కారణంగా మొత్తంగా 39 మంది మృతి చెందినట్లు విపత్తు నిర్వహణ విభాగం నివేదించింది. మొత్తం 22,537 ఎకరాల్లో పంటనష్టం జరిగినట్లు తెలిపింది. విపత్తు నిర్వహణ కోసం రెండు బృందాలను ఏపీలో అందుబాటులో ఉంచినట్లు పేర్కొంది.    

మరిన్ని వార్తలు