Year Ender 2023: ఐదుగురు ప్రియురాళ్లు... సరిహద్దులు దాటి, చిక్కుల్లో పడి..

26 Dec, 2023 12:19 IST|Sakshi

ప్రేమకు హద్దులు, సరిహద్దులు లేవంటారు. ప్రేమను పొందేందుకు కొందరు ఎంతకైనా వెనుకాడరు. ఇదేకోవలో ఐదుగురు మహిళలు ప్రేమ కోసం తమ దేశ సరిహద్దులు దాటి, విదేశాల్లోకి ప్రవేశించి, చిక్కుల్లో పడ్డారు. వీటికి సంబంధించిన ఉందంతాలు 2023లో దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. 

సీమా హైదర్ 
సీమా హైదర్ పేరు దేశంలో చర్చనీయాంశమైంది, పాకిస్తాన్‌కు చెందిన ఈ 27 ఏళ్ల మహిళ ఆన్‌లైన్ గేమ్ పబ్జీ ఆడుతూ 21 ఏళ్ల భారతీయ కుర్రాడు సచిన్ మీనా ప్రేమలో పడింది. నలుగురు పిల్లల తల్లి అయిన సీమా తన ప్రేమను నెరవేర్చుకునేందుకు పాకిస్తాన్ నుంచి సరిహద్దులు దాటి భారత్‌కు చేరుకుంది. సీమా.. భారత్‌ వచ్చేందుకు పాకిస్తాన్‌లోని తన ఇంటిని అమ్మేసింది. భారత్‌ వచ్చిన సీమాపై గూఢచర్యం ఆరోపణలు వచ్చాయి. విచారణ కూడా జరిగింది. ఇప్పటికి పూర్తి వివరాలు వెల్లడికాలేదు.

అంజు 
రాజస్థాన్‌కు చెందిన అంజు తన ప్రేమికుడు నస్రుల్లాను కలవడానికి పాకిస్తాన్‌కు వెళ్లింది. ఆమె అక్కడ తన తన పాకిస్తానీ ప్రేమికుడిని పెళ్లాడిందనే ప్రచారం జరిగింది. అయితే ఇది జరిగిన నాలుగు నెలల తర్వాత అంజు భారత్‌కు తిరిగి వచ్చింది. అంజును మొదట ఐబీ, తర్వాత పంజాబ్ పోలీసులు విచారించారు. ప్రస్తుతం ఆమె గ్వాలియర్‌లోని తన తండ్రి ఇంటిలో ఉంటోంది. అయితే ఆమె భారత్‌లో ఎంతకాలం ఉంటుంది? పాకిస్తాన్‌కు తిరిగి వెళ్తుందా? అనేది ఇంకా వెల్లడికాలేదు. 

జవేరియా ఖానుమ్ 
జావేరియా పాకిస్తాన్‌లోని కరాచీ నివాసి. త్వరలో ఆమె కోల్‌కతాకు చెందిన సమీర్‌ఖాన్‌ను పెళ్లి చేసుకోబోతోంది. వీరిద్దరికీ నిశ్చితార్థం జరిగింది. ఖానుమ్ భారతదేశానికి వచ్చి 45 రోజులు ఉంది. ఆమెకు డప్పులతో ఘన స్వాగతం పలికారు. అట్టారీ సరిహద్దు నుంచి ఆమె భారత్‌లోకి ప్రవేశించింది.

బార్బరా పొలాక్ 
జార్ఖండ్‌లోని తన ప్రియుడిని కలవడానికి పోలాండ్‌కు చెందిన బార్బరా పొలాక్ భారతదేశానికి వచ్చింది. ఆమెకు ఒక కుమార్తె ఉంది. విడాకులు తీసుకున్న ఆమె తన సోషల్ మీడియా స్నేహితుడు షాదాబ్‌ను పెళ్లి చేసుకోనుంది. ఆమె షాబాద్‌ను పెళ్లి చేసుకోవడానికి వీలుగా 2027 వరకు చెల్లుబాటు అయ్యే టూరిస్ట్ వీసాతో ఇండియాకు వచ్చింది. త్వరలో వీరు పెళ్లి చేసుకోబోతున్నారు.

కృష్ణా మండల్‌ 
కృష్ణా మండల్ అనే బంగ్లాదేశ్ మహిళ తన ప్రియుడు అభిక్ మండల్‌ను కలిసేందుకు బంగ్లాదేశ్ మీదుగా ఈదుకుంటూ భారత్‌ వచ్చింది. కృష్ణా.. అభిక్ మండల్‌ వివాహం చేసుకోవాలనుకున్నారు. కానీ ఆమెకు పాస్‌పోర్ట్ లేదు. కోల్‌కతాలోని కాళీఘాట్ ఆలయంలో వారు పెళ్లి చేసుకున్నారు. అయితే  కృష్ణాను భారత ఏజెన్సీ అరెస్టు చేసి, బంగ్లాదేశ్ హైకమిషన్‌కు అప్పగించింది.
ఇది కూడా చదవండి: 2023లో జేకేలో ఎన్‌కౌంటర్లు ఎన్ని? ఎందరు మరణించారు?

>
మరిన్ని వార్తలు