మోదీకి ప్రశ్నలు.. ట్విస్ట్‌ ఇచ్చిన ఎంపీ మహువా మోయిత్రా

27 Oct, 2023 19:37 IST|Sakshi

ఢిల్లీ: తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) ఎంపీ మహువా మోయిత్రా అంశంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎథిక్‌ కమిటీ విచారణను తాను ఇప్పుడు రాలేనని ఆమె లేఖ రాశారు. ఈ మేరకు లేఖను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. దీంతో, ఈ వ్యవహరం పొలిటికల్‌గా హాట్‌ టాపిక్‌గా మారింది. 

అయితే, డబ్బులు తీసుకొని పార్లమెంటులో ప్రశ్నలు అడిగారని టీఎంసీ ఎంపీ మహువా మోయిత్రా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీంతో, ఈ విషయంలో విచారణకు రావాల్సిందిగా పార్లమెంట్‌ ఎథిక్‌ కమిటీ ఎంపీకి నోటీసులు ఇచ్చింది. ఈ నోటీసులపై ఎంపీ మహువా స్పందిస్తూ ఎథిక్స్‌ కమిటీకి తాజాగా లేఖ రాశారు. ఈ లేఖలో..‘ఎథిక్స్ కమిటీ ఛైర్మన్‌ నాకు సమన్లు ఈ-మెయిల్‌ చేయడానికి ముందే టీవీల్లో వాటిని ప్రసారం చేశారు. నాపై నమోదైన ఫిర్యాదులు, సుమోటో అఫిడవిట్‌లు మీడియా సంస్థలకు అందాయి. నా నియోజకవర్గంలో ముందుగా షెడ్యూల్‌ చేసిన కార్యక్రమాలు నవంబరు 4న ముగిసిన వెంటనే విచారణకు హాజరవుతాను అని తెలిపారు. 

ఇదే సమయంలో నియోజకవర్గంలో అక్టోబరు 30 నుంచి నవంబరు 4 వరకు ముందుగా షెడ్యూల్‌ చేసిన కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉందని, అందువల్ల అక్టోబరు 31న కమిటీ విచారణకు హాజరుకాలేనని మొయిత్రా లేఖలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా గతంలో బీజేపీ ఎంపీ రమేష్‌ భిధూరీ విజ్ఞప్తి మేరకు లోక్‌సభ ప్రివిలేజ్‌ కమిటీ విచారణ తేదీని మార్పు చేసిన విషయాన్ని ఆమె లేఖలో ప్రస్తావించారు. అదే విధంగా తనకు మినహాయింపు ఇవ్వాలని కోరారు. ఈ మేరకు తన లేఖను ట్విట్టర్‌లో షేర్‌ చేశారు. 

మరోవైపు మొయిత్రాపై ఆరోపణలు చేసిన బీజేపీ నేత నిషికాంత్‌ దూబే, న్యాయవాది జై అనంత్‌ దేహాద్రాయ్‌లు గురువారం కమిటీ ముందు హాజరై.. తమ వాంగ్మూలాలను నమోదు చేశారు. కమిటీ సభ్యుల ముందు నిషికాంత్‌ దూబే మాట్లాడుతూ.. మొయిత్రాపై సాక్ష్యాలు స్పష్టంగా ఉన్నాయన్నారు. లంచం తీసుకుని ప్రధాని మోదీని ఇరుకునబెట్టేందుకు వ్యాపారవేత్త గౌతమ్ అదానీపై ప్రశ్నలు అడిగారని, ఆమె అడిగిన 60 ప్రశ్నల్లో 51 అదానీపైనే ఉన్నాయని నిషికాంత్ దూబే ఆరోపిస్తూ ఇప్పటికే లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. ఈ క్రమంలో ఆమె లోక్‌సభ సభ్యత్వాన్ని తక్షణమే రద్దు చేయాలని కోరారు.

ఇదిలా ఉంటే మోయిత్రాకు సంబంధించిన పార్లమెంట్ లాగిన్ వేరే వ్యక్తుల చేతికి వెళ్లినట్లు నిషికాంత్ దూబే ఆరోపించారు. ఆమె ఇండియాలో ఉన్న సమయంలో దుబాయ్ నుంచి లాగిన్ అయినట్లు ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఎథిక్స్ కమిటీ ఈ కేసును సీరియస్‌గా తీసుకుంది. అయితే మోయిత్రా చేసిన విదేశీ పర్యటన వివరాలను హోంమంత్రిత్వ శాఖను నుంచి పార్లమెంట్ ప్యానెల్ కోరే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ కేసులో టీఎంసీ.. ఎంపీ మహువా మోయిత్రాకు సపోర్టు చేయలేదు. విచారణ జరుగుతుందని ఏం జరుగుతుందో చూడాలనే ధోరణిని టీఎంసీ ప్రదర్శిస్తోంది.

మరిన్ని వార్తలు