రైతులతో కొలిక్కిరాని చర్చలు

2 Dec, 2020 02:00 IST|Sakshi
చర్చల అనంతరం మీడియాతో మాట్లాడుతున్న రైతు సంఘాల ప్రతినిధులు

చిన్న బృందంతో చర్చిద్దామని ప్రతిపాదించిన కేంద్రం 

చర్చల్లో అందరికీ అవకాశం ఇవ్వాలని పట్టుబట్టిన రైతు సంఘ నాయకులు 

సాగు చట్టాల్లోని అభ్యంతరకర అంశాలను తెలియజేయాలన్న కేంద్ర మంత్రులు 

సాక్షి, న్యూఢిల్లీ: వివాదాస్పద వ్యవసాయ చట్టాలు సహా రైతులు లేవనెత్తిన అన్ని అంశాల అధ్యయనానికి కమిటీని ఏర్పాటు చేస్తామన్న కేంద్ర ప్రభుత్వ సూచనను రైతు సంఘాలు తోసిపుచ్చాయి. ఢిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో మంగళవారం ముగ్గురు సీనియర్‌ కేంద్ర మంత్రులతో 35 రైతు సంఘాల ప్రతినిధులు చర్చలు జరిపారు. ఈ సందర్భంగా కమిటీ ఏర్పాటు చేస్తామన్న సూచనను కేంద్ర మంత్రులు ముందుకు తెచ్చారు. కానీ, ఆ ప్రతిపాదనను రైతు సంఘాలు తిరస్కరించాయి. రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను రద్దు చేయడమొక్కటే తమ నిరసనను ముగించేందుకు ఏకైక మార్గమని తేల్చి చెప్పాయి. దాంతో, ఎలాంటి పురోగతి లేకుండానే చర్చలు ముగిశాయి. మరో విడత చర్చలు గురువారం జరగనున్నాయి.

కొత్త సాగు చట్టాల వల్ల కనీస మద్దతు ధర వ్యవస్థ రద్దయిపోతుందని, కార్పొరేట్ల దయాదాక్షిణ్యాలపై రైతులు ఆధారపడే పరిస్థితి వస్తుందన్న రైతుల ఆందోళనను సంఘాల ప్రతినిధులు కేంద్ర మంత్రులకు వివరించారు. ఈ చర్చల్లో కేంద్రం తరఫున వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్, రైల్వే, కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ మంత్రి పీయూష్‌ గోయల్, వాణిజ్య శాఖ సహాయమంత్రి సోమ్‌ ప్రకాశ్‌ పాల్గొన్నారు. సోమ్‌ప్రకాశ్‌ పంజాబ్‌కు చెందిన ఎంపీ. కొత్త చట్టాల్లోని అభ్యంతరకర అంశాలను తమ ముందుకు తీసుకు రావాలని కేంద్ర మంత్రులు నరేంద్ర సింగ్‌ తోమర్, పీయూష్‌ గోయల్‌ ప్రతిపాదించారు. చర్చల కోసం చిన్న బృందంతో కమిటీని ఏర్పాటు చేస్తామని  ప్రతిపాదించారు. అందులో ఆరుగురు రైతు సంఘాల ప్రతినిధులు, వ్యవసాయ రంగ నిపుణులు, ప్రభుత్వ ప్రతినిధులు సభ్యులుగా ఉంటారన్నారు.

ఈ ప్రతిపాదనతో రైతు సంఘాల నేతలు విభేదించారు. 35కు పైగా ఉన్న రైతు సంఘాల ప్రతినిధులను ఆరుగురికి కుదించడం ద్వారా రైతు సంఘాల ఐక్యతను ప్రభుత్వం విచ్చిన్నం చేసే ప్రయత్నం చేస్తోందని రైతు సంఘాల నాయకులు ఆరోపించారు. ‘చిన్న కమిటీని ఏర్పాటు చేసేందుకు వీలుగా 5 నుంచి 7 మంది సభ్యుల పేర్లను సూచించాలని మంత్రులు కోరారు. ఆ ప్రతిపాదనను మేం తిరస్కరించాం’ అని భారతీయ కిసాన్‌ యూనియన్‌(బీకేయూ) నేత బల్దేవ్‌ సింగ్‌ తెలిపారు. మరోసారి గురువారం చర్చలు జరుగుతాయని నరేంద్ర సింగ్‌ తోమర్‌  మీడియాకు వెల్లడించారు.

సాగు చట్టాలపై అభ్యంతరాలను స్పష్టంగా చెబితే చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని వారికి చెప్పామన్నారు.  భారతీయ కిసాన్‌ యూనియన్‌ నేతలతో ప్రత్యేకంగా ఎందుకు చర్చలు జరుపుతున్నారన్న ప్రశ్నకు.. చర్చలకు వారు ముందుకు వచ్చారని, ఎవరు వచ్చినా చర్చలు జరుపుతామని తోమర్‌ జవాబిచ్చారు. మూడు సాగు చట్టాల్లోని తమ అభ్యంతరాలను ప్రత్యేకంగా గుర్తించి, వాటితో గురువారం నాటి చర్చలకు రావాలని రైతు సంఘాల ప్రతినిధులకు ప్రభుత్వం ఒక అధికారిక ప్రకటనలో సూచించింది.  మరోవైపు, ఢిల్లీ శివార్లలోని సింఘు, టిక్రీల్లో రైతుల శాంతియుత నిరసన కొనసాగుతోంది. ఘాజీపూర్‌ శివార్ల వద్ద జరుగుతున్న ఆందోళనల్లో రైతుల సంఖ్య భారీగా పెరింది. 

లిఖితపూర్వక హామీ ఇవ్వండి 
కనీస మద్దతు ధర(ఎమ్‌ఎస్పీ) వ్యవస్థ కొనసాగుతుందని రైతులకు లిఖితపూర్వక హామీ ఇవ్వాలని హరియాణా బీజేపీ అధికార కూటమిలోని పార్టీ ‘జన నాయక జనతా పార్టీ(జేజేపీ)’ కేంద్రానికి సూచించింది. ఎమ్‌ఎస్పీ కొనసాగుతుందని ప్రధాని మోదీ, వ్యవసాయ మంత్రి తోమర్‌ పదేపదే చెబుతున్నారని, అదే విషయాన్ని లిఖితపూర్వకంగా ఇస్తే బావుంటుందని జేజేపీ అధ్యక్షుడు అజయ్‌ సింగ్‌ చౌతాలా పేర్కొన్నారు. మరోవైపు, రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని ఆరోపిస్తూ హరియాణా ప్రభుత్వానికి స్వతంత్ర ఎమ్మెల్యే సోంబిర్‌ సాంగ్వన్‌ మద్దతు ఉపసంహరించారు. రైతులను బాధిస్తోందని ఆయన ఆరోపించారు.    

మరిన్ని వార్తలు