కోవిడ్‌ కేసుల పెరుగుదల ఆందోళనకరమే.. కానీ: అదర్‌ పూనావాలా

21 Dec, 2022 16:10 IST|Sakshi

పొరుగు దేశం చైనాతో పాటు పలు దేశాల్లో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతుండటం ఆందోళన కలిగించే విషయమేన్నారు వ్యాక్సిన్‌ మేకర సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌ఐఐ) సీఈఓ అదర్‌ పూనావాలా. అయితే, ప్రజలు ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదన్నారు. భారత్‌లో కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ విస్తృతంగా చేపట్టడం, కేసుల కట్టడి వంటి ట్రాక్‌ రికార్డు గొప్పగా ఉందని పేర్కొన్నారు. అయితే, కేంద్ర ప్రభుత్వం, కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ మార్గదర్శకాలను తప్పకుండా పాటించాలని ట్విట్టర్‌ వేదికగా ప్రజలను కోరారు.

‘కరోనా కేసులు పెరుగుతున్నట్లు చైనా నుంచి వస్తున్న వార్తలు ఆందోళనకరమే. ఇప్పటికే మనం విస్తృత స్థాయిలో వ్యాక్సిన్‌ పంపిణీ చేయడం, మెరుగైన పనితీరు కారణంగా భయపడాల్సిన అవసరం లేదు. కేంద్రం, ఆరోగ్య శాఖ మార్గదర్శకాలపై నమ్మకం ఉంచి తప్పకుండా పాటించాలి.’అని ట్విట్టర్‌లో పేర్కొన్నారు సీరమ్‌ సీఈఓ అదర్‌ పూనావాలా. 

కోవిడ్‌-19ను ఎదుర్కొనేందుకు సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా ‘కోవిషీల్డ్‌’ అనే వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేసింది. దేశంలో ఎక్కువ శాతం ఈ కోవిషీల్డ్‌నే ప్రజలకు అందించింది కేంద్రం. ఇతర దేశాలకు సైతం ఎగుమతి చేశారు. చైనాతో పాటు అమెరికా, బ్రెజిల్‌ కొరియా సహా పలు దేశాల్లో కరోనా కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. పాజిటివ్‌ కేసుల నమూనాలను జీనోమ్‌ సీక్వెన్సింగ్‌కు పంపుతూ కొత్త వేరియంట్లపై అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రాలకు సూచించింది. అలాగే.. రద్ది ప్రదేశాల్లో ప్రజలు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని కోరింది.

ఇదీ చదవండి: కోవిడ్‌ కథ ముగియలేదు.. అప్రమత్తంగా ఉందాం: కేంద్రం

మరిన్ని వార్తలు