Nagaland Firing: డ్రెస్‌ మార్చి, మృతదేహాల దగ్గర ఆయుధాలు పెట్టబోయారు 

9 Dec, 2021 16:38 IST|Sakshi

యువకులను మిలిటెంట్లుగా చిత్రీకరించాలనుకున్నారు

నాగాలాండ్‌ ఫైరింగ్‌ ఘటనలో భద్రతాబలగాలపై గ్రామస్తుల ఆరోపణ  

కోహిమా: నాగాలాండ్‌ ఫైరింగ్‌ ఘటనలో భద్రతాదళాలు 13 మంది యువకులను చంపి, మిలిటెంట్లుగా చిత్రీకరించ చూశాయని మోన్‌ జిల్లా ఓటింగ్‌ గ్రామస్తులు తెలిపారు. మృతదేహాలను దాచి, బట్టలు మార్చి, పక్కన ఆయుధాలను పెట్టేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. ఘటన జరిగిన నాలుగు రోజుల తరువాత గ్రామస్తులు గొంతు విప్పారు. ఓటింగ్‌ సిటిజెన్స్‌ ఆఫీస్‌లో బుధవారం మీడియాతో మాట్లాడారు. ‘‘డిసెంబర్‌ 4న 3:30గంటల సమయంలో బొగ్గుగనుల్లో పనిచేసే ఎనిమిది మంది యువకులతో పికప్‌ ట్రక్‌ గని నుంచి తిరిగి గ్రామానికి వస్తోంది. తెల్లారితే ఆదివారం సెలవురోజు. సాయంత్రం నాలుగున్నరకు అందులో ఉన్న ప్రయాణికుల గురించి ఏ వివరాలు తెలుసుకోకుండానే ట్రక్‌ మీద భద్రతాదళాలు దాడి చేశాయి.

చదవండి: Nagaland Tragedy: నాగాలాండ్‌ నరమేథం

తరువాత రోడ్డును బ్లాక్‌ చేసి... ట్రాఫిక్‌ను పాత పయనీర్‌ రోడ్డు మీదుగా వెళ్లాలని సూచించాయి. ఎంతవరకూ పికప్‌ ట్రక్‌ గ్రామానికి రాకపోవడంతో ఆందోళనతో ఎదురుచూస్తున్నాం. తరువాత కాల్పులు జరిగాయని తెలిసింది. 8గంటలకు మేం వెళ్లేసరికి పికప్‌ ట్రక్‌ ఖాళీగా ఉంది. డ్రైవర్‌ సీటు ఎదురుగా అద్దానికి బుల్లెట్‌ దూసుకుపోయిన గుర్తులు కనిపించాయి. అంటే ట్రక్‌ను ఆపేందుకు వాళ్లు ముందుగా డ్రైవర్‌ను పాయింట్‌ బ్లాంక్‌లో కాల్చారు. తరువాత మోటార్‌బైక్‌లపై వెళ్లి భద్రతా బలగాల వాహనాలను పట్టుకునే ప్రయత్నం చేశాం. భద్రతా సిబ్బందిని అడిగితే తమకేమీ తెలియదన్నారు. అక్కడే ఓ టార్పాలిన్‌ కనిపించింది.

దాన్ని తొలగించి చూస్తే... ఆరుగురు యువకుల మృతదేహాలు కనిపించాయి. వాళ్ల షర్ట్స్‌ తొలగించి ఉన్నాయి. మిలిటెంట్ల బట్టలు, బూట్లు వేసి ఆయుధాలను పెట్టే ప్రయత్నం చేశారు. ఇదే విషయమై ప్రశ్నిస్తే... మాపైనా దాడికి దిగారు. కాల్పులు ప్రారంభించి మరికొందరిని చంపేశారు. ఇంకొందరిని గాయపరిచారు. జనాభాలోనూ, ప్రాంతంలోనూ మేం తక్కువ కావొచ్చు. కానీ... పోరాటంలో మా ప్రాణాలు ఇవ్వడానికైనా, శత్రువుల తలలు తీయడానికైనా సిద్ధంగా ఉంటాం’’ అని గ్రామస్తులు ఉద్ఘాటించారు. ఈ ఘటనను సుమోటోగా తీసుకున్న నాగాలాండ్‌ పోలీసులు ఎస్పీఎఫ్‌ పైన ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. కాగా ఇండియన్‌ ఆర్మీ ఈ ఘటనపై మేజర్‌ జనరల్‌ స్థాయి అధికారితో విచారణకు ఆదేశించింది.

మరిన్ని వార్తలు