ప్రజల గొంతు నొక్కేయగలరా?

27 Apr, 2023 05:33 IST|Sakshi
మన్‌ కీ బాత్‌ కాఫీ టేబుల్‌ బుక్‌ను ఆవిష్కరిస్తున్న ధన్‌ఖడ్, కేంద్ర సమాచార, ప్రసార మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌

సోనియా వ్యాసంపై ధన్‌ఖడ్‌ ఆక్షేపణ 

‘మన్‌ కీ బాత్‌’ దేశానికి ఆశాదీపమని ప్రశంస

న్యూఢిల్లీ: భారతదేశంలో ఉన్నంత భావ ప్రకటన స్వేచ్ఛ ప్రపంచంలో ఇంకెక్కడా లేదని ఉప రాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌ అన్నారు. దేశంలో బీజేపీ పాలనలో ప్రజల గొంతు నొక్కేస్తున్నారంటూ కాంగ్రెస్‌ నేత సోనియా గాంధీ ఇటీవల ఓ పత్రిక వ్యాసంలో చేసిన వ్యాఖ్యలను ఖండించారు. అవి తనకు బాధ కలిగించాయన్నారు. ప్రజల గొంతును ఎవరూ నొక్కేయలేరని చెప్పారు. బుధవారం ‘మన్‌కీ బాత్‌ 100 జాతీయ సదస్సు’ ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడారు.

ప్రధాని నరేంద్ర మోదీ ప్రతినెలా నిర్వహించే ఈ రేడియో కార్యక్రమం దేశానికి ఒక ఆశాదీపమన్నారు. దీనిద్వారా రాజకీయాలకు అతీతంగా మోదీ దేశానికి సందేశమిస్తున్నారని ప్రశంసించారు. కొందరు నాయకులు విదేశాలకు వెళ్లి, మన దేశాన్ని తూలనాడుతున్నారని మండిపడ్డారు. మోదీ హయాంలో ఎంతో అభివృద్ధి జరుగుతోందంటూ ప్రశంసల వర్షం కురిపించారు. మన్‌ కీ బాత్‌ 100 కాఫీ టేబుల్‌ బుక్‌ తదితరాలను ధన్‌ఖడ్‌ విడుదల చేశారు.

ముఖ్యమైన భావప్రసారం: ఆమిర్‌ ఖాన్‌  
మన్‌ కీ బాత్‌ చాలా ముఖ్యమైన భావప్రసార కార్యక్రమమని బాలీవుడ్‌ నటుడు ఆమిర్‌ ఖాన్‌ ప్రశంసించారు. మన్‌ కీ బాత్‌ ద్వారా మోదీ దేశ ప్రజలతో అనుసంధానం అవుతున్నారని తెలిపారు. అత్యంత కీలకమైన అంశాలపై చర్చిస్తున్నారని, తన ఆలోచనలు పంచుకుంటూ చక్కటి సలహాలు, సూచనలు ఇస్తున్నారని అమీర్‌ ఖాన్‌ ప్రశంసించారు.

మరిన్ని వార్తలు