వాట్సాప్‌లో కొత్త రకం మాల్‌వేర్

1 Feb, 2021 17:17 IST|Sakshi

వాట్సాప్‌ వినియోగదారులు కొత్త మాల్‌వేర్ బారిన పడుతున్నారనే వార్తలు వినిస్తున్నాయి. వాట్సాప్ యూజర్లను టార్గెట్ చేస్తున్న హ్యాకర్లు, కొత్తరకం వార్మబుల్ మాల్‌వేర్‌ను ఫోన్లు, డివైజ్‌లలోకి పంపిస్తున్నారు. ప్రస్తుతం దీన్ని వార్మ్ అనే పేరుతో పిలుస్తున్నారు. ముందు వాట్సాప్ యూజర్లకు ఇతరుల నుంచి మీకు ఒక మెస్సేజ్ లేదా లింక్ వస్తుంది. దీన్ని క్లిక్ చేస్తే ఫోన్లలో ఇతర నఖిలీ యాప్‌లు డౌన్‌లోడ్ అవుతాయి. వీటి ద్వారా మీ వ్యక్తిగత డేటాను సులభంగా దొంగిలిస్తారు. ఇది వివిధ రకాల ఫంక్షన్లు, పర్మిషన్లను ఎనేబుల్ చేయాలని యూజర్లకు నోటిఫికేషన్లు ఇస్తుంది. అనంతరం ఫోన్‌కు ఏదైనా వాట్సాప్ మెస్సేజ్ రాగానే, మాల్‌వేర్ ద్వారా తక్షణమే ఫేక్ లింక్స్ ఉండే మెస్సేజ్‌లు రిప్లైగా వెళ్తాయి. ప్రస్తుతం వీటి ద్వారా వినియోగదారులకు ఎక్కువ మొత్తంలో యాడ్స్‌ రావచ్చు. ఇవి ప్రజలను ప్రకటనలతో విసిగిస్తాయి.

వాట్సాప్ కు వచ్చిన సందేశం స్పామ్ లాగా కనిపించకుండా ఉండటానికి గంటకు ఒకసారి పింగ్ చేయబడుతుంది. అలాగే ఇలా మెసేజ్ వచ్చిన ప్రతిసారి 'ఈ అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకొని మొబైల్ ఫోన్‌ను గెలుచుకోండి' అనే ఫేక్ లింకులను డిస్‌ప్లే చేస్తాయి. వాట్సాప్ యూజర్లకు ఏమాత్రం అనుమానం రాకుండా ఉండటానికి ఒక నకిలీ గూగుల్ లింక్ లాగా ఉంటుంది. ఎవరైనా ఈ లింక్‌ను క్లిక్ చేస్తే క్లోన్ గూగుల్ ప్లే స్టోర్, క్లోన్ 'హువావే మొబైల్' అనే యాప్ ను  డౌన్‌లోడ్ చేయమని ఆ వ్యక్తిని అడుగుతుంది. ఇవి నిజమైన యాప్ లు కావు నకిలీ యాప్ లు. ఈ క్లోనింగ్ యాప్‌ల ద్వారా ఫిషింగ్ మెస్సేజ్‌లు కస్టమర్ల ఫోన్‌లలో డౌన్‌లోడ్ అవుతాయి.

ఈ యాప్ లను కనుక డౌన్‌లోడ్ చేసుకొని ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ద్వారా ఫంక్షన్లు, పర్మిషన్లను మీరు ఎనేబుల్ చేస్తే ఇక మీ పని అంతే. మీ వ్యక్తిగత డేటాతో పాటు, ఇతర ముఖ్యమైన డేటా వారి చేతుల్లోకి వెళ్ళిపోతుంది. ఈ నకిలీ డొమైన్లపై సరైన చర్యలు తీసుకోవాలని డొమైన్ ప్రొవైడర్‌కు తెలియజేస్తున్నాము అని వాట్సాప్ ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు. ఎవరు అనుమానిత మెస్సేజ్‌లను ఓపెన్ చేయవద్దని, లింకులపై క్లిక్ చేయవద్దని నిపుణులు సూచిస్తున్నారు.
 

మరిన్ని వార్తలు