పొత్తు లేకనే కాంగ్రెస్‌ చిత్తు?.. ఇండియా అలయన్స్ నేతలు ఏమంటున్నారు?

5 Dec, 2023 07:26 IST|Sakshi

హిందీ రాష్ట్రాలైన మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. ఈ రాష్ట్రాల్లో భారీ విజయం సాధించిన నేపధ్యంలో బీజేపీ బలం మరింతగా పెరిగింది. ఎన్నికల ఫలితాల అనంతరం కాంగ్రెస్‌లో కలకలం చెలరేగుతోంది.  ప్రతిపక్ష కూటమి ఇండియా (ఇండియా అలయన్స్) భవిష్యత్తుపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. జాతీయ స్థాయి కూటమి ఏర్పడినప్పుడు, ఈ రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఒంటరిగా ఎన్నికల్లో ఎందుకు పోటీ చేసిందనే ప్రశ్నను ఆ కూటమిలోని పార్టీలే లేవనెత్తుతున్నాయి. 

కాంగ్రెస్ ఇతర పార్టీలతో కలిసి ఎన్నికల్లో పోటీ చేసి ఉంటే ఫలితాలు మరోలా ఉండేవని కూడా  ఆయా పార్టీలు అంటున్నాయి. ఈ మూడు రాష్ట్రాల్లో పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగా పోటీ చేయాలని కాంగ్రెస్‌ ఎందుకు నిర్ణయించుకుందనే దానిపై కాంగ్రెస్ సీనియర్ నేత మాణికం ఠాగూర్ మీడియాకు తెలియజేశారు. పార్టీ కేంద్ర నాయకులు పొత్తు ఆవశ్యకతను తెలుసుకున్నారని, హిందీ బెల్ట్‌లోని రాష్ట్ర స్థాయి నాయకులు కూటమి అవసరాన్ని గ్రహించాల్సి ఉందన్నారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్ వంటి రాష్ట్రాల రాజకీయాల్లో ద్వంద్వ స్వభావం ఉందని, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉందని అ‍న్నారు. 

పొత్తులకు ఉండే ప్రాముఖ్యతను రాష్ట్రస్థాయి నేతలు అర్థం చేసుకోవాలని, ట్రాక్ రికార్డ్ లేదా ఇతర విషయాల ఆధారంగా టిక్కెట్లు ఇచ్చే బదులు, కాంగ్రెస్ అభ్యర్థికి ప్రస్తుతం గెలిచేందుకు గల అవకాశాలను పరిశీలించిన తర్వాతనే ఎన్నికల్లో టిక్కెట్ ఇవ్వాలని మాణికం ఠాగూర్ అన్నారు. కాగా నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్, ఇండియా అలయన్స్ సభ్యుడు ఒమర్ అబ్దుల్లా కూడా కాంగ్రెస్ ఓటమి వెనుక కారణాలను మీడియాకు తెలిపారు. 

మధ్యప్రదేశ్‌లోని పరిస్థితిని కాంగ్రెస్ అర్థం చేసుకోలేకపోయిందని, అఖిలేష్ యాదవ్‌కు 5 నుంచి 7 సీట్లు ఇస్తే ఏమి నష్టం జరిగేదని ప్రశ్నించారు. రాష్ట్ర ఎన్నికలలో ఇండియా కూటమి ఫలితాలు చూస్తుంటే.. భవిష్యత్తులో కూడా ఇదే పరిస్థితి కొనసాగితే తాము ఎప్పటికీ గెలవలేమని ఆయన అన్నారు. ఈ ఘోర పరాజయం తర్వాత కాంగ్రెస్ డిసెంబర్‌ 6న భారత కూటమి సమావేశానికి పిలుపునిచ్చింది. ఈ సమావేశం న్యూఢిల్లీలో జరగనుంది. అయితే ఈ సమావేశానికి మమతా బెనర్జీ హాజరుకావడం లేదని టీఎంసీ వర్గాలు తెలిపాయి.
ఇది కూడా చదవండి: కాంగ్రెస్ సీనియర్ నేతలతో సోనియా గాంధీ కీలక భేటీ

>
మరిన్ని వార్తలు