ప్రియుడే కావాలి.. సీరియల్‌ స్టైల్‌లో సూపర్‌ ప్లాన్‌

22 Sep, 2022 07:34 IST|Sakshi

యశవంతపుర: ప్రియుని కోసం భర్తలను చంపే సంఘటనలు కర్నాటకలో పెరుగుతున్నాయి. ఒక టీవీ సీరియల్‌ ప్రేరణతో వివాహిత తన భర్తను పరలోకానికి పంపిన వైనం మండ్య జిల్లా మళవళ్లి తాలూకాలో జరిగింది. మళవళ్లి ఎన్‌ఇఎస్‌ లేఔట్‌లో నివాసం ఉంటున్న శశికుమార్‌ (30)ని భార్య నాగమణి (28), ప్రియుడు హేమంత్‌ (25)లు కలిసి ఆదివారం రాత్రి హత్య చేశారు.  

గార్మెంట్స్‌లో పరిచయమై  
కనకపురలో గార్మెంట్స్‌కు వెళ్తున్న నాగమణికి హేమంత్‌ పరిచయమయ్యాడు. ఇద్దరి మధ్య అక్రమ సంబంధం ఏర్పడింది. ఇది తెలిసి భర్త ఆమెను పలుసార్లు మందలించాడు. మొబైల్‌ఫోన్‌ను లాక్కుని పనికి వెళ్లవద్దని కట్టడి చేయడంతో ఆమె భగ్గుమంది. భర్తను తప్పిస్తే ఏ అడ్డూ ఉండదని నాగమణి నిశ్చయించుకుంది. టీవీలో వచ్చే కన్నడ సీరియల్‌ శాంతం పాపం చూస్తూ అందులో మాదిరిగానే హత్యకు పథకం వేసింది.  

ప్రియునితో కలిసి హత్య  
ఆదివారం రాత్రి ప్రియుడు హేమంత్‌ని పిలిపించుకుంది. నిద్రిస్తున్న పిల్లల చేతులు, కాళ్లు కట్టేసి నోటిలో బట్టలు కుక్కారు. తరువాత మద్యం మత్తులో నిద్రిస్తున్న శశికుమార్‌ను చున్నీతో గొంతు బిగించి హత్య చేశారు. ఎవరో దుండగులు చొరబడి చంపేశారని నాగమణి ఏడుపు అందుకుంది. కొడుకు మృతిపై అనుమానంతో తల్లి తాయమ్మ పోలీసులకు ఫిర్యాదు చేయగా సోమవారం నుంచి అరెస్టు చేసి విచారించగా నేరం ఒప్పుకుంది.  జంటను రిమాండ్‌కు తరలించారు. ఆమె ఇద్దరు పిల్లలూ అనాథల్లా మారారు. 

మరిన్ని వార్తలు