వాహనదారులకు అలర్ట్‌.. ఆ సర్టిఫికెట్‌ లేకపోతే నో పెట్రోల్‌, డీజిల్‌

1 Oct, 2022 16:03 IST|Sakshi

వాహనాదారులకు ఢిల్లీ ప్రభుత్వం షాకిచ్చింది. దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్య నియంత్రణ కోసం ఆమ్‌ ఆద్మీ పార్టీ సర్కార్‌ కీలక నిర​యం తీసుకుంది. బంకుల్లో పెట్రోల్‌, డీజిల్‌ కావాలంటే తప్పనిసరిగా పొల్యూషన్‌ సర్టిఫికెట్‌(పీయూసీ) ఉండాలనే నిబంధన విధించింది. 

వివరాల ప్రకారం.. ఢిల్లీలో ప్రతీ శీతాకాలం గాలి కాలుష్య తీవ్రత బాగా పెరుగుతుంది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో కాలుష్య నియంత్రణ కోసం అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రభుత్వం.. పీయూసీ  సర్టిఫికెట్‌ను తప్పనిసరి చేసింది. పీయూసీ సర్టిఫికెట్‌ లేకుండా బంకుల్లో పెట్రోల్‌, డీజిల్‌ను పోయరని స్పష్టం చేసింది. అక్టోబర్‌ 25 నుంచి ఈ నిర్ణయం అమలులోకి వస్తుందని ఢిల్లీ పర్యావరణశాఖ మంత్రి గోపాల్‌రాయ్‌ శనివారం తెలిపారు. 

ఈ సందర్భంగా మంత్రి గోపాల్‌రాయ్‌ మాట్లాడుతూ సెప్టెంబర్‌ 29న పర్యావరణం, రవాణా, ట్రాఫిక్‌ అధికారులతో సమావేశం సందర్భంగా కాలుష్య నియంత్రణకు ప్రణాళిక, విధివిధానాలను చర్చించినట్టు తెలిపారు. కాగా, పీయూసీ సర్టిఫికెట్‌కు సంబంధించిన నోటిఫికేషన్‌ తర్వలోనే విడుదలవుతుందని వెల్లడించారు. అంతేకాకుండా అక్టోబర్‌ 6వ తేదీ నుంచి యాంటీ డస్ట్‌ క్యాంపెయిన్‌ను ప్రారంభించనున్నట్లు తెలిపారు. అక్కడ నిర్మాణ స్థలాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి కాలుష్యాన్ని అరికట్టనున్నట్లు స్పష్టం చేశారు. దీంతో, కాలుష్య నియంత్రణ కొంత మేరకు సాధ్యమవనుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 

మరిన్ని వార్తలు