Haryana: రామ్‌లల్లా శిల్పికి శ్రీకృష్ణ విగ్రహం ఆర్డర్‌!

28 Jan, 2024 07:14 IST|Sakshi

అయోధ్యలో రామ్‌లల్లా విగ్రహానికి రూపాన్ని ఇచ్చిన కళాకారుడు యోగిరాజ్ ఇప్పుడు కురుక్షేత్రలో శ్రీ కృష్ణుని భారీ విగ్రహాన్ని తయారుచేసేందుకు సిద్ధం అవుతున్నారు. మహాభారత సమయంలో అర్జునునితో సంభాషిస్తున్న శ్రీ కృష్ణుని భారీ రూపాన్ని యోగిరాజ్‌ తీర్చిదిద్దనున్నారు. 

శ్రీరాముని విగ్రహం తరహాలోనే ఈ విగ్రహాన్ని కూడా నేపాల్‌లోని గండకీ నది నుంచి సేకరించిన శాలిగ్రామశిలతో తయారు చేయనున్నారు. హర్యానాలోని కురుక్షేత్ర పరిధిలో గల బ్రహ్మసరోవర్ ఒడ్డున నిర్మితమవుతున్న 18 అంతస్తుల జ్ఞాన మందిరంలోని గర్భగుడిలో యోగిరాజ్‌ రూపొందించే శ్రీ కృష్ణుని విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. 

మూడు ఎకరాల స్థలంలో 18 అంతస్తుల జ్ఞాన మందిరాన్ని నిర్మిస్తున్నట్లు శ్రీ బ్రహ్మపురి అన్నక్షేత్ర ట్రస్ట్ జ్ఞాన మందిర్ వ్యవస్థాపకులు స్వామి చిరంజీవ్‌పురి మహారాజ్ తెలిపారు. ఆలయ గర్భగుడిలో అర్జునునికి సందేశం ఇస్తున్న రీతిలో శ్రీ కృష్ణుని భారీ విగ్రహాన్ని తయారు చేయనున్నారు. ఇందుకోసం శిల్పి అరుణ్ యోగిరాజ్‌తో ఇప్పటికే చర్చలు జరిగాయి. త్వరలోనే శిల్పి అరుణ్ యోగిరాజ్ ఈ ఆలయాన్ని సందర్శించనున్నారు.

శిల్పి అరుణ్ యోగిరాజ్.. శ్రీకృష్ణుని విగ్రహ తయారీకి అంగీకరించిన నేపధ్యంలో గండకీ నది నుంచి ప్రత్యేక శాలిగ్రామ రాయిని తీసుకురావడానికి ట్రస్ట్ నేపాల్‌ను సంప్రదిస్తోంది. ప్రస్తుతం ఈ ఆలయం నిర్మాణ దశలో ఉంది. 50 శాతానికి పైగా పనులు పూర్తయ్యాయి. 18 అంతస్తుల జ్ఞాన మందిరం అనేక ప్రత్యేకతలతో కూడి ఉంటుంది. గీతలోని 18 అధ్యాయాలు, 18 అక్షోహిణి సేన, 18 రోజుల మహాభారత యుద్ధం, కురుక్షేత్రంలో పవిత్ర సరస్వతి నది రూపం కూడా ఈ ఆలయంలో కనిపించనుంది.

whatsapp channel

మరిన్ని వార్తలు