రొట్టె కోసం అన్నను హత్య చేసిన తమ్ముడు!

12 Sep, 2023 08:29 IST|Sakshi

యూపీలోని కాన్పూర్‌లో రొట్టె ముక్కకోసం అన్నదమ్ములు రక్తం కళ్లజూసుకున్నారు. రొట్టె కోసం జరిగిన వివాదంలో తమ్ముడు అన్నను అత్యంత దారుణంగా హత్య చేశాడు. అన్నయ్య.. తమ్ముని కోసం ప్రత్యేకంగా రొట్టెలు తయారు చేయకపోవడమే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. అన్నను హత్య చేసిన తమ్ముడు అంతటితో ఆగక సోదరుని మృతదేహంతో ఏమి చేశాడో తెలిస్తే ఎవరికైనా వణుకు పుడుతుంది. 

ఈ ఉదంతం కాన్పూర్‌లోని బిల్హౌర్‌ పరిధిలోని నానామవు గ్రామంలో చోటుచేసుకుంది. ఈ ప్రాంతంలోని ఒక ఇంటిలో కల్లూ, భూరా అనే అన్నదమ్ములుంటున్నారు. వీరిలో కల్లూ పెద్దవాడు. అతనికి ఇంకా వివాహం కాలేదు. అయితే అతని సోదరుడు భూరాకు వివాహం జరిగింది. అతని భార్య రక్షాభంధన్‌ కోసం పుట్టింటికి వెళ్లి, ఇంకా తిరిగి రాలేదు. ఆమె ఇంటిలో ఉన్నప్పుడు భర్తకు, కల్లూకు వంటవండేది. తాజాగా భూరా పనిమీద ఇంటి నుంచి బయటకు వెళుతూ అన్నతో తాను ఇంటికి వచ్చేసరికి రొట్టెలు తయారు చేసిపెట్టాలని కోరాడు. అయితే రాత్రి భూరా ఇంటికి వచ్చేసరికి కల్లూ అతని కోసం రొట్టెలు తయారు చేయలేదు. 

వెంటనే కోపంతో రగిలిపోయిన భూరా తన అన్నను ‘రొట్టెలు ఎందుకు తయారు చేయలేదని’ అడిగాడు. దానికి సమాధానంగా కల్లూ ‘నువ్వు నాకు రొట్టెలు తయారు చేయలేదు కనుక నేను నీకు రొట్టెలు తయారు చేయలేదు’ అని అన్నాడు. ఈ నేపధ్యంలో వీరిద్దరి మధ్య వివాదం మొదలయ్యింది. ఇంతలో తమ్మడు ఇంటి బయట ఉన్న పెద్ద బండరాళ్లు తీసుకు వచ్చి ఏకధాటిగా అన్నపై దాడి చేశాడు. ఈ దాడిలో అన్న అక్కడికక్కడే మృతి చెందాడు.

అన్న మృతిచెందినా తమ్ముని ఆగ్రహం ఇంకా చల్లారలేదు. అన్న మృతదేహానికి తాడుకట్టి, దానికి లాక్కుంటూ గ్రామం శివారులకు తీసుకువచ్చాడు. అక్కడున్న నదిలోని పడవలో అన్న మృతదేహాన్ని ఉంచి, నది మధ్యలో దానిని వదిలివేశాడు. అయితే తమ్ముడు అన్న మృతదేహాన్ని రోడ్డుపై ఈడ్చుకుంటూ తీసుకువెళుతున్నప్పుడు గ్రామానికి చెందిన కొందరు దానిని గమనించి, పోలీసులకు ఫిర్యాదు చేశారు.  

సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. ఈ సందర్భంగా డీసీపీ విజయ్‌ ఢులా మాట్లాడుతూ తమ విచారణలో నిందితుడు.. రొట్టె కోసం తనకు, తన అన్నకు వివాదం జరిగిందని, ఈ నేపధ్యంలోనే తాను అన్నను హత్యచేశానని తెలిపాడన్నారు. నదిలోని కల్లూ మృతదేహాన్ని వెలికితీసే ప్రయత్నం చేస్తున్నామన్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామన్నారు.   
ఇది కూడా చదవండి: ‘హైదరాబాద్‌ హౌస్‌’ యజమాని ఎవరు? డబ్బును నీళ్లలా ఎందుకు ఖర్చు చేశారు?

మరిన్ని వార్తలు