టైరు పేలి వడ్ల లారీ బోల్తా

25 May, 2023 00:48 IST|Sakshi
రహదారిపై బోల్తా పడిన వడ్ల లారీ.. వడ్ల బస్తాలను మరో లారీలోకి మారుస్తున్న హమాలీలు

డిచ్‌పల్లి: డిచ్‌పల్లి నుంచి కోటగిరి మండలంలోని రై స్‌మిల్లుకు వడ్ల బస్తాలు తీసుకుని వెళుతున్న లారీ ప్రమాదవశాత్తు బోల్తా పడింది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా.. డిచ్‌పల్లి గ్రామంలోని కొనుగోలు కేంద్రంలో 660 వడ్ల బస్తాలను (264 క్వింటాళ్లు) లారీ (నెంబర్‌ ఎంహెచ్‌ 29 టీ 1891)లో లోడ్‌చేసి కోటగిరి మండలంలోని బాలాజీ ట్రేడర్స్‌ రైస్‌మిల్‌ కు తరలిస్తున్నారు. నడిపల్లి శివారులోని భారత్‌ పె ట్రోల్‌బంక్‌ వద్దకు రాగానే వేగంగా వెళుతున్న లారీ డివైడర్‌ను ఢీనడంతో టైరు పేలింది. దీంతో కుడి వైపు రోడ్డుపై లారీ బోల్తా పడటంతో వడ్ల బస్తాలు రోడ్డుపై పడిపోయాయి. వెంటనే లారీ డ్రైవర్‌ పరారయ్యాడు. దీంతో సుమారు రెండు గంటల పాటు వడ్ల బస్తాలు రోడ్డుపై పడి ఉండటంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. స్థానికులు సమాచారం ఇచ్చినా అటు పోలీసులు, ఇటు సంబంధిత అధికారులు ఎవరూ సరైన సమయంలో స్పందించలేదు. డిచ్‌పల్లి సొసైటీ చైర్మన్‌ గజవాడ జైపాల్‌, సీఈవో కిషన్‌, సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మరో లారీని రప్పించారు. హమాలీల సాయంతో వడ్ల బస్తాలను మరో లారీలోకి ఎక్కించి కోటగిరి రైస్‌మిల్‌కు పంపించారు. లారీ బోల్తా పడిన సమయంలో ఎదురుగా ఎలాంటి వాహనాలు రాకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పినట్లయింది.

మరిన్ని వార్తలు