రెండుసార్లు ఎంపీ.. కానీ ఈసారి విముఖత..!

27 Aug, 2023 11:19 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌: నిజామాబాద్‌ ఎంపీగా రెండుసార్లు ప్రాతినిధ్యం వహించిన టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్‌ మధుయాష్కీ గౌడ్‌ తన తదుపరి రాజకీయ రంగస్థలంగా రంగారెడ్డి జిల్లా ఎల్‌బీనగర్‌ శాసనసభ స్థానాన్ని ఎంచుకున్నారు. ఎల్‌బీనగర్‌ టిక్కెట్టు కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆ పార్టీ కార్యకర్తలు భిన్నరకాలుగా చర్చించుకుంటున్నారు. ఏడాదిన్నర కాలం నుంచే మధుయాష్కీ ఎల్‌బీనగర్‌ కోసం ప్రయత్నాలు చేస్తున్నారంటూ పార్టీ శ్రేణుల్లో చెప్పుకుంటున్నారు. ఈ మేరకు ఆయన సన్నిహితులు సైతం ఈ విషయాన్ని పలుసార్లు ప్రస్తావించారు.

ఈ కారణంగానే యాష్కీ టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్‌గా ఉన్నప్పటికీ నిజామాబాద్‌ జిల్లా వైపు చూడడం లేదంటూ జిల్లా నాయకులు, కార్యకర్తలు బహిరంగంగానే ఆరోపణలు గుప్పించారు. పార్టీ నాయకత్వం నాలుగు సార్లు ఎంపీ టిక్కెట్టు ఇవ్వగా రెండుసార్లు గెలిచిన యాష్కీ, జిల్లా విషయమై ఏమీ పట్టనట్లు వ్యవహరించడం పట్ల ఇక్కడి నాయకులు, కార్యకర్తలు వివిధ సమావేశాల్లోనే విమర్శలు చేయడం గమనార్హం. మధుయాష్కీ ఎల్‌బీనగర్‌ అసెంబ్లీ సీటు కోసం ప్రయత్నాలు చేస్తున్నారంటూ ‘సాక్షి’ పత్రికలో 2022 ఏప్రిల్‌ 3వ తేదీనే కథనం ప్రచురితమైంది.

కష్టకాలంలో వదిలేసి వెళ్తే ఎలా..
బీసీలకు ప్రాధాన్యత కోరుతున్న నేపథ్యంలో పార్టీ అధిష్టానం సైతం తగిన సీట్లు ఇచ్చేందుకు సిద్ధమని ప్రకటించింది. ఇలాంటి సమయంలో రెండుసార్లు ఎంపీగా, జాతీయ నాయకుడిగా రాహుల్‌గాంధీ వద్ద గుర్తింపు తెచ్చుకున్న మధుయాష్కీ ఈ విధంగా తరలివెళ్లడ మే మిటని నాయకు లు, కార్యకర్తలు అంటున్నారు. ఈ ఆలోచనతోనే ముందునుంచే నిజామాబాద్‌ జిల్లాకు పూర్తిగా దూరమయ్యారంటూ పలువురు నిరసన వ్యక్తం చేస్తున్నారు.

ఎన్‌ఆర్‌ఐగా వచ్చిన యాష్కీని జిల్లా నుంచి వరుసగా రెండుసార్లు పార్లమెంటు సభ్యుడిగా గెలిపించినప్పటికీ జిల్లా ప్రజలు, పార్టీ కార్యకర్తలతో అంతగా మమేకం కాకపోవడంతో తరువాత వరుసగా రెండు సార్లు గెలిచే అవకాశాలను దూరం చేసుకున్నారంటున్నారు. అధిష్టానం ఉన్నతమైన అవకాశాలు కల్పిస్తే, కష్టకాలంలో జిల్లా పార్టీ కార్యకలాపాల విషయంలో ఏ మాత్రం పట్టింపు లేకుండా వ్యవహరించారని, తా జాగా ఆర్మూర్‌ నుంచి బీసీ నాయకుడిగా పోటీ చేసే అవకాశం ఉన్నప్పటికీ ఎల్‌బీనగర్‌ వెళ్లడమేమిటని కార్యకర్తలు గుర్రుగా ఉన్నారు.

జిల్లాలో సభ్యత్వ కార్యక్రమంతో పాటు మీ నాక్షీ నటరాజన్‌ పాదయాత్రకు సైతం యాష్కీ దూ రంగా ఉన్నారని పార్టీ నాయకులు అసహనంగా ఉ న్నారు. కీలకమైన నిజాం షుగర్స్‌, పసుపు బోర్డు అంశాలపై చేసిన పోరాటాల్లో యాష్కీ తనకేమీ ప ట్టనట్లు ఉండడంతోనే గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌పై వ్యతిరేకతను కాంగ్రెస్‌కు అనుకూలంగా మలచుకో లేని దుస్థితి నెలకొందని కార్యకర్తలు చెబుతున్నా రు. గతంలో మాజీ విప్‌ ఈరవత్రి అనిల్‌కుమార్‌ యాష్కీపై బహిరంగ సభలో తీవ్ర విమర్శలు చేయడంతో పాటు చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చే యగా జిల్లా వ్యాప్తంగా కార్యకర్తలు ముక్తకంఠంతో మద్దతు తెలపడం గమనార్హం.

ఆర్మూర్‌లో పోటీ అవసరమైనప్పటికీ..
బీసీలకు ప్రాధాన్యత ఇస్తామని పార్టీ అధినాయకత్వం ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో, రాష్ట్రంలోని ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలో రెండు నుంచి మూడు ఎమ్మెల్యే సెగ్మెంట్లు బీసీలకు ఇవ్వాలని పార్టీలో డిమాండ్‌ ఉంది. ఈ పరిస్థితుల్లో ఆర్మూర్‌, నిజామాబాద్‌ అర్బన్‌ సెగ్మెంట్లు బీసీలకు కేటాయించే అవకాశాలున్నట్లు గాంధీభవన్‌ వర్గాలు తెలిపాయి.

కాగా ఇప్పటివరకు ఆర్మూర్‌ నియోజకవర్గంలో కాంగ్రెస్‌కు సరైన నాయకత్వం లేకపోవడంతో పార్టీ కార్యక్రమాలు సక్రమంగా జరగకపోగా, అసలు ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరనే చర్చ జరుగుతూ వచ్చింది. ఈ నేపథ్యంలో బీసీ వర్గానికి చెందిన, ఇప్పటివరకు నాలుగు సార్లు ఎంపీగా పోటీచేసి రెండుసార్లు గెలుపొందిన మధుయాష్కీ ఇటువైపు ఆలోచన చేయకపోవడమేమిటని పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


మరిన్ని వార్తలు