ధరణి బదులు ‘మీ భూమి’ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో బీజేపీ హామీ

19 Nov, 2023 04:38 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో తాము అధికారంలోకి వస్తే ప్రజలందరికీ సుపరిపాలన అందిస్తామని, సమర్థవంతమైన పాలనపై దృష్టిపెడతామని బీజేపీ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించింది. భూముల రికార్డులకు సంబంధించి ధరణి స్థానంలో పారదర్శంగా ఉండేలా ‘మీ భూమి’ వ్యవస్థను తీసుకువస్తామని ప్రకటించింది. ఎస్సీ వర్గీకరణ వేగవంతం చేస్తామని, వెనుకబడిన వర్గాల సాధికారత కోసం అందరికీ చట్టం ఎదుట సమాన గుర్తింపు ఉండేలా చర్యలు తీసుకుంటామని పే ర్కొంది.

బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ‘సకల జనుల సౌభాగ్య తెలంగాణ’ పేరిట దీనిని విడుదల చేశారు. అందులో తెలంగాణను ప్రగతిపథంలో నడిపేందుకు రెండు విభాగాలుగా పది ప్రధాన లక్ష్యాలను, 25 అంశాల కార్యాచరణను బీజేపీ ప్రకటించింది. రాజ్యాంగంలోని ఆర్టీకల్‌ 48 ప్రకారం తెలంగాణలో గోహత్యపై సంపూర్ణ నిషేధం అమలుచేస్తామని పేర్కొంది. గోహత్య విషయంలో...నేరం రుజువైతే నేరస్థులకు మూడేళ్ల కు తక్కువ కాకుండా ఏడేళ్ల వరకు జైలుశిక్ష, ఒక పశువుకు రూ.50 వేల చొప్పున రూ.5 లక్షల దాకా జరిమానా లేదా రెండూ విధిస్తామని తెలిపింది. 

ప్రధాన కార్యాచరణ అంశాలివీ.
► ఏటా సెప్టెంబర్‌ 17న అధికారికంగా హైదరాబాద్‌ విమోచన దినోత్సవం నిర్వహణ. పరకాల, బైరాన్‌పల్లిలలో అమరులైన వారిని స్మరించుకుంటూ ఆగస్టు 27ను ‘రజాకార్ల దుష్కృత్యాల సంస్మరణ’ దినంగా నిర్వహణ. 
► రజాకార్లు, నిజాంకు వ్యతిరేకంగా పోరాడి అమరులైన వారి గుర్తుచేసుకునేలా హైదరాబాద్‌లో ఓ స్మారకం, మ్యూజియం ఏర్పాటు. 
► అవినీతిపై ఉక్కుపాదం. బీఆర్‌ఎస్‌ సర్కారు హయాంలో కాళేశ్వరం, ధరణి, ఇతర అంశాల్లో అవినీతి, కుంభకోణాల ఆరోపణలపై సుప్రీంకోర్టు రిటైర్డ్‌ న్యాయమూర్తి నేతృత్వంలో విచారణ కమిషన్‌ ఏర్పాటు 
► ప్రధాని మోదీ ఆలోచనలకు అనుగుణంగా.. ‘సబ్‌ కా సాథ్‌ – సబ్‌ కా వికాస్, సబ్‌ కా విశ్వాస్‌ – సబ్‌ కా ప్రయాస్‌’ నినాదంతో అవినీతి రహిత సుపరిపాలన 
► రాష్ట్రంలోని 52% వెనుకబడిన వర్గాల ఆకాంక్షలను నెరవేరుస్తూ, అందరికీ సామాజిక న్యాయం, సమగ్రాభివృద్ధికి బాటలు. రాష్ట్రానికి బీసీ సీఎం. 
► ఎస్సీల్లోని అత్యంత వెనుకబడిన వర్గాలకు సాధికారత కల్పించేలా ఎస్సీ వర్గీకరణను వేగవంతం చేయడానికి చర్యలు. 
► రాజ్యాంగ నియమాలకు విరుద్ధంగా, మత ప్రతిపాదికన ఇచ్ఛిన రిజర్వేషన్లను తొలగించి వాటిని వెనుకబడిన వర్గాలు, గిరిజనులకు (జనాభాకు అనుగుణంగా) అందజేస్తాం. 
► ద్రవ్యోల్బణం తగ్గించడంతోపాటు సాధారణ ప్రజలకు ఊరట కల్గించేందుకు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉన్నట్టుగా పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్‌ తగ్గింపు 
► రాష్ట్ర రైతులకు ఎరువుల అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని.. కేంద్రం ఇస్తున్న ఎరువుల సబ్సిడీ (ఎకరానికి రూ.18వేలు) అమలు. చిన్న, సన్నకారు రైతులు ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేసేందుకు రూ.2,500 ఇన్‌పుట్‌ అసిస్టెన్స్‌. 
► ప్రధాని మోదీ ప్రకటించిన జాతీయ పసుపు బోర్డు, ప్రాసెసింగ్‌ యూనిట్ల ఏర్పాటు ద్వారా రాష్ట్రంలోని ఆయా ప్రాంతాల్లో ఉపాధి కల్పనకు బాటలు. మార్కెట్‌ ఇంటర్వెన్షన్‌ ఫండ్‌ ఏర్పాటు. 
► వరి ధాన్యానికి రూ.3,100 మద్దతు ధర. తెలంగాణలో ఉత్పత్తయ్యే మొత్తం బియ్యం కొనుగోలుకు చర్యలు 
► ప్రధాన మంత్రి ఫసల్‌ బీమా యోజన ద్వారా రైతులకు ఉచిత పంటల బీమా సదుపాయం. 
► ఉజ్వల లబి్ధదారులకు ఏడాదికి నాలుగు గ్యాస్‌ సిలిండర్లు ఉచితం. 
► ఆడబిడ్డ భరోసా పథకంతో నవజాత బాలికల పేరిట బ్యాంకులో ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌. వారికి 21 ఏళ్లు వచ్చాక రూ.2లక్షలు పొందవచ్చు. 
► డిగ్రీ, ప్రొఫెషనల్‌ కోర్సుల్లో చేరే విద్యార్థినులకు ఉచితంగా ల్యాప్‌టాప్స్‌ 
► స్వయం సహాయక బృందాలకు నామమాత్రపు వడ్డీకే రుణాలు 
► యూపీఎస్సీ తరహాలో.. గ్రూప్‌–1, గ్రూప్‌–2 సహా టీఎస్‌పీఎస్సీ పరీక్షలు ఆర్నెల్లకోసారి పారదర్శకంగా నిర్వహణ 
► ఆసక్తి గల రైతులకు ఆరోగ్యకరమైన ఆవును ఉచితంగా అందిస్తాం 
► అర్హత కలిగిన కుటుంబాలకు.. ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ ఏడాదికి రూ.10 లక్షల వరకు ఉచిత ఆరోగ్య కవరేజీ. పేద కుటుంబాలకు ఏడాదికోసారి ఉచిత వైద్య పరీక్షలు
►కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా హక్కును పొందేందుకు కేడబ్ల్యూడీ– ఐఐ ముందు రాష్ట్ర వాదనలు సమర్థవంతంగా వినిపిస్తాం 
► ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రతినెలా 1వ తేదీనే వేతనాలు, పింఛన్లు అందేలా చర్యలు 
► వివిధ చట్టాలను ఏకీకృతం, సమన్వయం చేసి ఉమ్మడి పౌరస్మృతి ముసాయిదాను రూపొందించేందుకు కమిటీ 
► కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వనరులను సమన్వయం చేసుకుంటూ.. పేదలందరికీ ఇళ్ల మంజూరు. గ్రామాల్లో అర్హులైన పేదలకు ఇంటి పట్టాలను అందిస్తాం. 
► వయోవృద్ధులకు ఉచితంగా అయోధ్య, కాశీ యాత్రలు 
► తెలంగాణకు చెందిన ఎన్నారైలు, గల్ఫ్‌ కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేక నోడల్‌ విభాగం/మంత్రిత్వ శాఖ ఏర్పాటు.

పది ప్రధాన లక్ష్యాలు ఇవీ.. 
► ప్రజలందరికీ సుపరిపాలన.. సమర్థవంతమైన పాలనపై దృష్టి. ధరణి స్థానంలో పారదర్శకమైన ‘మీ భూమి’ వ్యవస్థ 
► రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ పథకాల సమర్థ అమలుకోసం నోడల్‌ మంత్రిత్వ శాఖ 
► వెనుకబడిన వర్గాల సాధికారత.. అందరికీ చట్టం ఎదుట సమాన గుర్తింపు. అందరికీ సామాజిక న్యాయం, సమగ్రాభివృద్ధికి బాటలు. ఎస్సీల్లోని అత్యంత వెనుకబడిన వర్గాలకు సాధికారత కల్పించేలా ఎస్సీ వర్గీకరణ వేగవంతం 
► కూడు–గూడు: ఆహార, నివాస భద్రత.  పేదలకు ఇళ్ల పట్టాలు అందజేత. అర్హత కలిగిన కుటుంబాలకు కొత్త రేషన్‌కార్డులు 
► రైతే రాజు– అన్నదాతకు అందలం 
► నారీశక్తి– మహిళల నేతృత్వంలో అభివృద్ధికి ప్రోత్సాహం 
► యువశక్తి–ఉపాధి: అన్ని ప్రభుత్వ ఉద్యోగాలు 6 నెలల్లోనే భర్తీ 
►వైద్యశ్రీ– నాణ్యమైన వైద్య సంరక్షణ చర్యలు, మౌలిక వసతులు, ఇతర సౌకర్యాల కల్పన 
► నిజాం షుగర్స్‌ ఫ్యాక్టరీ పునరుద్ధరణకు చర్యలు 
► ప్రభుత్వ ప్రాజెక్టుల ముసుగులో ఇసుక అక్రమ తవ్వకాలకు పాల్పడే వారిపై, అక్రమ తవ్వకాలకు సహకరిస్తున్న అధికారులపై కఠిన చర్యలు. నదీ గర్భాల కోత నిరోధానికి కొత్త ఇసుక మైనింగ్‌ విధానం

మరిన్ని వార్తలు