నాసా కొత్త ఆస్ట్రోనాట్ అనిల్‌ మీనన్‌.. ఎవరీయన? నేపథ్యం ఏంటంటే..

7 Dec, 2021 18:35 IST|Sakshi

నాసా.. అమెరికా స్పేస్‌ ఏజెన్సీ. కానీ, ప్రపంచం దృష్టిలో అత్యున్నతమైన అంతరిక్ష ప్రయోగాలకు ఇది నెలవనే అభిప్రాయం ఉంది. అందుకే నాసాలో పని చేయడానికి దేశాలకతీతకంగా సైంటిస్టులు, రీసెర్చర్లు ఉవ్విళ్లూరుతుంటారు. అదే టైంలో టాలెంట్‌ ఎక్కడున్నా వెతికి పట్టుకోవడంలో నాసా ఎప్పుడూ ముందుంటుంది. ఇదిలా ఉంటే తాజాగా తన కొత్త ఆస్ట్రోనాట్ టీంను ప్రకటించింది. 


సోమవారం కొత్తగా పది మందితో కూడిన ఆస్ట్రోనాట్ బృందాన్ని ప్రకటించింది నాసా. మొత్తం 12,000 అప్లికేషన్లు రాగా, అందులోంచి ఈ పది మందిని మాత్రమే ఎంపిక చేశారు. వీళ్లంతా నాసా భవిష్యత్తులో చేపట్టబోయే మిషన్లలో పాల్గొననున్నారు.  ఇక ఈ టీంలో భారత మూలాలున్న అనిల్‌ మీనన్‌ ఇందులో ఒకరు.

45 ఏళ్ల అనిల్‌ మీనన్‌..  నాసా ఫ్లయిట్‌ సర్జన్‌గా 2014 నుంచి సేవలు అందిస్తున్నారు. 

ఇంటర్నేషనల్‌ స్పేస్‌ స్టేషన్లో డిప్యూటీ క్రూ సర్జన్‌గా వ్యవహరించారు కూడా.

డాక్టర్‌ అనిల్‌ మీనన్‌ భారత మూలాలున్న వ్యక్తే.  

నాసాలోని బయోడేటా ప్రకారం.. అనిల్‌ మీనన్‌.. ఉక్రెయిన్‌-భారత సంతతికి చెందిన పేరెంట్స్‌కి జన్మించారు. ఆయన పుట్టి పెరిగింది  మిన్నియాపొలిస్‌(మిన్నెసోటా)లో.

1999లో హార్వార్డ్‌ యూనివర్సిటీ నుంచి  న్యూరోబయాలజీలో డిగ్రీ అందిపుచ్చుకున్నారు. 

2004లో స్టాన్‌ఫర్డ్‌ యూనివర్సిటీ నుంచి మెకానికల్‌ ఇంజినీరింగ్‌ మాస్టర్‌ డిగ్రీ పూర్తి చేశారు.

2009 స్టాన్‌ఫర్డ్‌ మెడికల్‌ స్కూల్‌ నుంచి మెడిసిన్‌లో డాక్టరేట్‌ పూర్తి చేశారాయన 

యూఎస్‌ ఎయిర్‌ఫోర్స్‌లో కొంతకాలం విధులు నిర్వహించారు

2018లో స్పేస్‌ఎక్స్‌లో చేరిన అనిల్‌.. కంపెనీ ఫస్ట్‌ హ్యూమన్‌ ఫ్లైట్‌ ప్రిపరేషన్‌లో పాలుపంచుకున్నాడు. 

స్పేస్‌ఎక్స్‌ ఐదు లాంఛ్‌లకు సంబంధించి.. ఫ్లైట్‌ సర్జన్‌గా విధులు నిర్వహించారు. 

కాలిఫోర్నియా ఎయిర్‌ నేషనల్‌ గార్డ్‌లో చేరిన మీనన్‌, అడవుల్లో సంచరించేవాళ్లు హఠాత్తుగా గాయపడ్డ వాళ్లకు చికిత్స అందించడంలో నేర్పరి కూడా. 

ఎమర్జెన్సీ మెడిసిన్‌, స్పేస్‌ మెడిసిన్‌ మీద ఎన్నో సైంటిఫిక్‌ పేపర్స్‌ ప్రచురించారాయన. 

ప్రస్తుతం ఆయన ఫ్లయిట్‌ సర్జన్‌గా నాసాలో పని చేస్తూ.. హోస్టన్‌లో ఉంటున్నారు.


భార్య అన్నా మీనన్‌తో అనిల్‌

నాసా ప్రొఫైల్‌ ప్రకారం..  అనిల్‌ మీనన్‌ 2010 హైతీ భూకంప సమయంలో, 2015 నేపాల్‌ భూకంప సమయంలో, 2011 రెనో ఎయిర్‌షో ప్రమాద సమయంలో ముందుగా స్పందించారు. 

భార్య అన్నా మీనన్‌తో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు.

నాసా అడ్మినిస్ట్రేటర్ బిల​ నెల్సన్‌.. ఆస్ట్రోనాట్ బృందాన్ని స్వయంగా ప్రకటించారు. వీళ్లను ఐదు కేటగిరీల శిక్షణ ఇప్పిస్తారు. అందులో ఇంటర్నేషనల్‌ స్పేస్‌ స్టేషన్‌లో సంక్లిష్ట సమస్యల పరిష్కారం, స్పేస్‌వాక్‌ శిక్షణ, సంక్షిష్టమైన రొబోటిక్‌ స్కిల్స్‌ను డెవలప్‌ చేసుకోవడం, టీ-38 ట్రైనింగ్‌ జెట్‌ను సురక్షితంగా ఆపరేట్‌ చేయడం, చివరగా.. రష్యన్‌ లాంగ్వేజ్‌ స్కిల్స్‌ శిక్షణ. 

► 2022 జనవరిలో అనిల్‌ మీనన్‌ నాసా ఆస్ట్రోనాట్ టీంలో చేరి.. శిక్షణ తీసుకోవడం ప్రారంభిస్తారు.

చదవండి: ఐఎంఎఫ్‌లో నెంబర్‌ 2 మన ఆడపడుచు

మరిన్ని వార్తలు