జాహ్నవి కందులకి మరణానంతర డిగ్రీ.. నార్త్‌ఈస్ట్రన్‌ యూనివర్సిటీ అధికారిక ప్రకటన

15 Sep, 2023 10:57 IST|Sakshi

వాషింగ్టన్‌: అమెరికాలో రోడ్డు ప్రమాదంలో కన్నుమూసిన భారతీయ విద్యార్థిని జాహ్నవి కందుల(23)కు మరణానంతర డిగ్రీ అందనుంది. ఈ విషయాన్ని నార్త్‌ఈస్ట్రన్‌ యూనివర్సిటీ అధికారికంగా ప్రకటించింది. జాహ్నవి తరపున ఆమె కుటుంబ సభ్యులకు ఎంఎస్‌ పట్టా అందజేస్తామని నార్త్‌ఈస్ట్రన్‌ యూనివర్సిటీ వీసీ తెలిపారు. 

ఆంధ్రప్రదేశ్‌ కర్నూలువాసి అయిన జాహ్నవి.. స్టూడెంట్‌ ఎక్స్‌ఛేంజ్‌ కార్యక్రమం కింద 2021లో అమెరికా వెళ్లింది. సౌత్‌ లేక్‌ యూనియన్‌లోని నార్త్‌ఈస్ట్రన్‌ యూనివర్సిటీ క్యాంపస్‌లో చేరిందామె. కెరీర్‌లో త్వరగా సెటిల్‌ అయ్యి.. కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలవాలని ఆమె కల. ఈ ఏడాది డిసెంబర్‌లో జాహ్నవి డిగ్రీ పూర్తి కావాల్సి ఉంది. పాపం ఈలోపే ఆమెను మృత్యువు రోడ్డు ప్రమాదం రూపంలో కబళించింది. 

ఈ ఏడాది జనవరి 23వ తేదీన రాత్రి ఆమె రోడ్డు ప్రమాదంలో కన్నుమూసింది. అతివేగంతో దూసుకొచ్చిన ఓ పోలీసు పెట్రోలింగ్‌ వాహనం ఆమెను బలిగొంది. ఈ ఘటనకు సంబంధించి..ప్రమాద సమయంలో సమాచారం అందుకున్న ఓ అధికారి.. ఆమె ప్రాణాలకు విలువే లేదన్నట్లు చులకనగా మాట్లాడిన మాటల్ని తాజాగా అక్కడి పోలీస్‌ శాఖనే బయటపెట్టింది. దీంతో భారతీయులు భగ్గుమన్నారు. దీనిపై తీవ్రంగా స్పందించిన భారత్‌.. ఆ అధికారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని అమెరికాను కోరింది. 

ఇప్పుడు.. ఈ ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన నార్త్ఈస్ట్రన్‌ (Northeastern University) ఛాన్సలర్‌ ‘‘ఈ విషాద ఘటన, దాని అనంతరం జరిగిన పరిణామాలతో మా క్యాంపస్‌లోని భారత విద్యార్థులు తీవ్రంగా ప్రభావితులయ్యారు. ఈ సమయంలో వారికి మేం అండగా ఉంటాం. అలాగే ఈ ఘటనలో బాధ్యులకు తప్పకుండా శిక్ష పడుతుందని మేం ఆశిస్తున్నాం. ఇక జాహ్నవికి మరణానంతరం డిగ్రీ ప్రదానం చేయాలని మేం నిర్ణయించాం. ఆమె కుటుంబంసభ్యులకు దాన్ని అందజేస్తాం’’ అని తెలిపారు.

మరిన్ని వార్తలు