ప్రపంచ సాహిత్యంలో అరుదైన ప్రక్రియ తెలుగు పద్యం

15 Dec, 2022 14:15 IST|Sakshi
డాక్టర్‌ ప్రసాద్‌ తోటకూరను అభినందిస్తున్న ప్రిన్సిపాల్, తెలుగు శాఖ అధ్యాపక వర్గం

సాక్షి, హైదరాబాద్: ప్రపంచ సాహిత్యంలో ఏ భాషలోనూ లేని అరుదైన ప్రక్రియ పద్యమని.. తెలుగు వారి సొత్తైన ఈ ప్రక్రియ కాపాడి ముందు తరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) సాహిత్య విభాగం ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డాక్టర్‌ ప్రసాద్‌ తోటకూర అన్నారు.

తానా సాహిత్య విభాగం తానా ప్రపంచ సాహిత్య వేదిక, ప్రభుత్వ సిటీ కళాశాల తెలుగు విభాగం సంయుంక్తాధ్వర్యంలో సిటీ కళాశాలలో జరిగిన మహోన్నతం మన పద్యం విద్యార్థి పద్యగాన సభలో అతిథిగా పాల్గొన్న డాక్టర్‌ ప్రసాద్‌ మాట్లాడుతూ... ప్రాచీన పద్యాలలో ఉన్న మానవీయ విలువలు, వ్యక్తిత్వ వికాసం వంటిని నేటితరం విద్యార్థులకు అందించడం, అలాగే పద్య పఠనం ద్వారా వారిలో ఏకాగ్రత, ధారణశక్తి, జ్ఞాపకశక్తి వంటిని పెంపొందించడం కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. 

పౌరాణిక నాటక పద్యాలలో గొప్ప జీవన విలువలున్నాయి.  పౌరాణిక నాటకాల ప్రదర్శనతో తెలుగు పద్యానికి విస్తృతి పెరిగిందని రంగస్థల కళాకారుడు గుమ్మడి గోపాలకృష్ణ అన్నారు. సత్య హరిశ్చంద్ర, శ్రీకృష్ణ రాయబారం, శ్రీకృష్ణ పాండవీయం తదితర పద్య నాటకాలు తెలుగు ప్రజానీకానికి గొప్ప సంస్కృతి సంతృప్తిని కలిగించాయన్నారు. కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ పి.బాల భాస్కర్‌ మాట్లాడుతూ... సిటీ కళాశాల విద్యార్థులలో చైతన్యం కోసం ఎన్నో వినూత్న కార్యక్రమాలను నిర్వహిస్తుందన్నారు.  

ఈ సందర్భంగా ఘట్టి బాల చైతన్యం, పద్య పరిమళం వంటి సంస్థలలో శిక్షణ పొందిన 25 మంది ప్రాథమిక, ఉన్నత పాఠశాలల చిన్నారులు ప్రాచీన కావ్యాలు, ప్రబంధాలు, శతకాలలోని పద్యాలను రాగయుక్తంగా, భావ గర్భితంగా ఆలపించి ఆధ్యాపకులను, సభికులను మంత్ర ముగ్ధులను చేశారు. (క్లిక్ చేయండి: తానా ఆధ్వర్యంలో సినీ ప్రముఖులకు పురస్కారాలు)

మరిన్ని వార్తలు