నేలకు నవ జీవం

27 Mar, 2023 01:32 IST|Sakshi
విత్తన గుళికలు తయారు చేసేందుకు సిద్ధం చేసిన నవధాన్యాలు, పప్పులు

గన్నవరం రూరల్‌: నేల తల్లి ఆరోగ్యం కాపాడేందుకు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయ సిబ్బంది కృషి చేస్తున్నారు. రసాయనిక ఎరువుల వాడకంతో భూములు సారం కోల్పోయాయి. చౌడు బారిపోయాయి. ఈ పరిస్థితులలో రేపటి తరానికి మంచి భూములను అందించాలన్న సదాశయంతో ప్రభుత్వం ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ గ్రామ గ్రామాన రైతులకు అవగాహన కల్పిస్తోంది.

ఈ కార్యక్రమంలో భాగంగా ప్రస్తుతం ఖరీఫ్‌ ముగిసి ఖాళీగా ఉన్న పంట చేలల్లో పచ్చిరొట్ట బదులు నవధాన్యాలు సాగును చేపడుతున్నారు. కృష్ణా జిల్లాలోని 25 మండలాల్లో 34వేల ఎకరాల్లో 2023–24 సంవత్సరానికి నవధాన్యాల సాగు చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఆయా మండలాల్లో ప్రకృతి వ్యవసాయ సిబ్బంది ఇప్పటికే రైతుల నుంచి ఆమోదం తీసుకొని విత్తన గుళికలు తయారు చేసి అందించేందుకు ఏర్పాట్లు చేశారన్నారు. నవధాన్యాలతో పాటు 32రకాల విత్తనాలు, వీటిలో ధాన్యం, పప్పు, నూనె, పచ్చిరొట్ట, సుగంధ ద్రవ్యాలు కలిసి ఉంటాయి. వీటిని ఎకరానికి 11కిలోలు విత్తన గుళికలుగా ఏర్పాటు చేస్తున్నారు.

32 రకాల విత్తనాలను బంకమట్టితో కలిపి వాటి పరిమాణాన్ని రెండున్నర రెట్లుగా పెంచుతారు. దీనికి ఘన జీవామృతాన్ని జోడించి రైతులకు అందజేస్తారు. విత్తన గుళికలు తయారీతో ఆ విత్తనాలను పక్షులు తినే వీలు లేకుండా ఉంటుంది. చల్లిన ప్రతి గింజ మొలకెత్తుతాయి.

పశువులకు మేతగా..

40 నుంచి 45రోజుల పాటు ఏపుగా ఎదిగే నవధాన్యాలపై పంట పశువులకు మేతగా రైతులు కోసుకుని లబ్ధి పొందుతారు. బలవర్థక పౌష్టికాహారం పశువులకు అందుతుంది. దీంతో పాడి లాభసాటిగా, పశువులు ఆరోగ్యంగా ఉండటంతో రైతులకు రెండు రకాలుగా మేలు జరుగుతుంది. భూమిలోకి వెళ్లిన వేళ్లు, రైతులు కోసివేయగా మిగిలిన నవధాన్యాల దుబ్బులు భూమిలో ట్రాక్టర్‌లతో కలియదున్నుతారు. దీంతో భూమి గుల్లబారి, నీటి నిల్వ సామర్థ్యం పెరిగి, సూక్ష్మ పోషకాలు భూమిలో వృద్ధి చెంది ఖరీఫ్‌ పంటకు జవసత్వాలు రెట్టింపవుతాయి.

దేశీ ఆవుపేడను పలచటి గుడ్డలో మూటకట్టి 20 లీటర్లు నీరు ఉన్న తొట్టెలో 12గంటలు ఉంచాలి. ఒక లీటరు నీటిని వేరే పాత్రలో తీసుకుని 50 గ్రాముల సున్నం కలిపి రాత్రంతా ఉంచి ఉదయాన్నే నానబెట్టిన పేడ మూటను చేతితో తిండి సారాన్ని నీటి తొట్టెలో కలపాలి. పుట్ట మందును పేడ నీరు ఉన్న తొట్టెలో వేసి కర్రతో తిప్పాలి. 12 గంటల పాటు నిల్వ ఉంచి మరునాడు విత్తనాలకు పట్టించి నీడలో ఆరబెట్టి నాటితే ఏ రకమైన చీడపీడలు రాకుండా విత్తనాలు మొలకెత్తుతాయి. వీటిపై ప్రకృతి వ్యవసాయం అధికారులు వివరిస్తూ రైతుల్లో చైతన్యం పెంచుతున్నారు.

నవధాన్యాల సాగుతో భూమి సారవంతం రసాయనిక ఎరువులను తగ్గించేందుకు ప్రభుత్వం ప్రణాళిక కృష్ణా జిల్లాలో సాగు విస్తీర్ణం పెరిగేలా చర్యలు పంటతో బహుళ ప్రయోజనాలు

విత్తన గుళికలు తయారీ ఇలా..

నవధాన్యాల సాగు..

బీజామృతం తయారీ..

మరిన్ని వార్తలు