మరువం.. మురిపెం

27 Mar, 2023 01:32 IST|Sakshi
అమ్మవారికి హారతి పడుతున్న అర్చకుడు

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): వసంత నవరాత్రోత్సవాలలో భాగంగా ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు ఆదివారం విశేష పుష్పార్చన జరిగింది. ఉత్సవాలలో భాగంగా 5వ రోజైన ఆదివారం అమ్మవారికి దవళం, మరువంత, తెల్లజిల్లేడు, మారేడు, తులసీలతో అర్చన నిర్వహించారు. తొలుత విశేష పుష్పార్చనకు వినియోగించే పుష్పాలతో ఆలయ మహిళా సిబ్బంది ఊరేగింపుగా వేదిక వద్దకు చేరుకున్నారు. రాజగోపురం నుంచి మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపు చిన్న రాజగోపురం సమీపంలోని లక్ష్మీ గణపతి విగ్రహం వద్దకు చేరుకుంది. అనంతరం ఆలయ అర్చకులు అమ్మవారికి విశేష పుష్పార్చన నిర్వహించగా, ఆలయ ఈవో భ్రమరాంబ, ఆలయ అధికారులు, భక్తులు, ఉభయదాతలు విశేష పుష్పార్చనను కనులారా వీక్షించారు. అర్చన అనంతరం అమ్మవారికి పంచహారతుల సేవ నిర్వహించారు. అర్చనానంతరం అమ్మవారి దర్శనానికి విచ్చేసిన భక్తులకు పుష్పాలను పంపిణీ చేశారు.

నేడు కాగడా మల్లెలు, జాజులతో అర్చన

వసంత నవరాత్రోత్సవాలలో భాగంగా 6వ రోజైన సోమవారం దుర్గమ్మకు కాగడా మల్లెలు, జాజులతో అర్చన జరుగుతుంది. అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని లక్ష్మీ గణపతి విగ్రహం వద్ద అమ్మవారి ఉత్సవ మూర్తికి విశేష పుష్పార్చన నిర్వహిస్తారు.

దుర్గమ్మకు దవళం, మరువంతో అర్చన

మరిన్ని వార్తలు