మే 10న ఝార్సుగుడ ఉప ఎన్నిక

31 Mar, 2023 02:24 IST|Sakshi
● ఏప్రిల్‌ 13న అధికారిక నోటిఫికేషన్‌ విడుదల ● 20వరకు నామినేషన్ల స్వీకరణకు అవకాశం ● ఎన్నికల నియమావళి తక్షణ అమలు ● వెల్లడించిన రాష్ట్ర ఎన్నికల అధికారి నికుంజ్‌బిహారీ

భువనేశ్వర్‌: ఝార్సుగుడ ఉప ఎన్నికకు సంబంధించి జాతీయ ఎన్నికల కమిషన్‌ మంగళవారం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రిగా ఉన్న నవకిషోర్‌ దాస్‌ జనవరి 29న దారుణ హత్యకు గురైన నేపథ్యంలో ఖాళీ అయిన అసెంబ్లీ స్థానాన్ని భర్తీ చేసేందుకు మే 10న ఉప ఎన్నిక పోలింగ్‌ నిర్వహించనున్నారు. 13న ఓట్లు లెక్కించి, ఫలితాలు వెల్లడిస్తారు. దీనికి సంబంధించి ఝార్సుగుడ జిల్లాలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి తక్షణమే అమల్లోకి వచ్చినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి(సీఈఓ) నికుంజ్‌బిహారీ ధల్‌ వెల్లడించారు. దీనికి సంబంధించి ఏప్రిల్‌ 13న అధికారిక నోటిఫికేషన్‌ వెలువడనుండగా, అదే నెల 20 వరకు నామినేషన్ల స్వీకరిస్తారు. 21న దస్తావేజుల పరిశీలన, 24 వరకు ఉపసంహరణకు అవకాశం కల్పిస్తారు. మే 10న పోలింగ్‌ నిర్వహించి, 13న ఫలితాలు వెల్లడిచడంతో పాటు 15లోగా ఉప ఎన్నిక ప్రక్రియ అంతా పూర్తి చేయాలని సీఈఓ వివరించారు. ఝార్సుగుడ నియోజకవర్గంలో మొత్తం 2,21,070మంది ఓటర్లు ఉన్నారు. వీరి కోసం 206వేర్వేరు ప్రాంతాల్లో 253 పోలింగ్‌ కేంద్రాల ఏర్పాటుకు జిల్లా అధికారులకు ఆదేశించారు.

ఈవీఎంతో పోలింగ్‌

ఉప ఎన్నికలో ఎలక్ట్రానిక్‌ ఓటింగు యంత్రాలతో పాటు వీవీ ప్యాట్‌లను వినియోగిస్తారు. ఈ మేరకు అవసరమైన పరికరాలను సిద్ధం చేశారు. దీనికి సంబంధించి తొలి విడత పరిశీలన ముగిసిందని సీఈఓ తెలిపారు. పోలింగ్‌ కేంద్రాల ప్రాంగణంలో ఓటర్ల కోసం మౌలిక సదుపాయాలు పుష్కలంగా అందుబాటులో ఉంటాయన్నారు. తాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్‌, ర్యాంప్‌ వంటి సౌకర్యాలు పుష్కలంగా ఉంటాయని వివరించారు.

కోవిడ్‌ మార్గదర్శకాలు..

ఉప ఎన్నిక పురస్కరించుకుని కోవిడ్‌–19 ఆంక్షలు తొలగించిన నేపథ్యంలో ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ సమయానుకూలంగా జారీ చేసిన నిబంధనలు అమలు చేయడం జరుగుతుందని సీఈఓ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అనుక్షణం కోవిడ్‌–19 సంక్రమణ పరిస్థితిని సమీక్షించి, సత్వర చర్యలు చేపట్టి నికరమైన మార్గదర్శకాలు జారీ చేస్తుందన్నారు. రాష్ట్ర పోలీస్‌ డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీసు సంప్రదింపులకు ఝార్సుగుడ నియోజకవర్గ ఉప ఎన్నిక శాంతియుతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.

పోటీకి సిద్ధం: శరత్‌ పట్నాయక్‌

రాష్ట్ర ఆరోగ్యశాఖ మాజీమంత్రి నవకిషోర్‌ దాస్‌ మరణంతో ఝార్సుగుడ అసెంబ్లీ స్థానం ఖాళీ అయిన విషయం తెలిసిందే. ఈ నియోజకవర్గ ఉప ఎన్నిక తేదీని ఎన్నికల సంఘం ప్రకటించడంతో రాష్ట్రంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఈ పోటీకి పూర్తిగా సిద్ధంగా ఉన్నామని ఒడిశా ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు శరత్‌ పట్నాయక్‌ తెలిపారు. కంటాబంజి ఎమ్మెల్యే సంతోష్‌సింగ్‌ సలూజా నేతృత్వంలో ప్రత్యేక సభ్యుల కమిటీ ఈ ఉప ఎన్నిక అభ్యర్థిని ప్రతిపాదిస్తుందన్నారు. ఈ బృందంలో ఐదుగురు సభ్యులు ఉంటారని, వీరి నివేదికల పరిశీలన మేరకు పోటీలో ఉన్న వారిని ప్రకటిస్తామని వెల్లడించారు.

మేమూ సిద్ధమే: మోహన్‌ మాఝీ

ఝార్సుగుడ ఉప ఎన్నికకు తామూ సిద్ధమేనని ప్రధాన ప్రతిపక్షం బీజేపీ చీఫ్‌ విప్‌ మోహన్‌ మాఝీ తెలిపారు. ప్రస్తుతం బూత్‌ సాధికారత కార్యక్రమం చురుగ్గా సాగుతోందన్నారు. ఉప ఎన్నికకు బీజేపీ పూర్తిగా సిద్ధంగా ఉన్నామని, ప్రాంతీయ బీజేపీ వర్గీయులు తీవ్రంగా కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. వ్యూహాత్మక కార్యాచరణతో పార్టీ అధిష్టానం సరైన సమయంలో అభ్యర్థిని ఎంపిక చేసి, ప్రకటిస్తుందన్నారు.

మరిన్ని వార్తలు