కేంద్రంపై మండిపడ్డ ఆప్‌ నేత రాఘవ్‌ చద్ధా

11 Sep, 2020 13:42 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో గల మురికివాడల్లోని ఇళ్లను మూడు నెలల్లోగా తొలగించాలంటూ ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు ఆమ్‌ ఆద్మీ పార్టీ, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధానికి తెరతీశాయి. పరస్పర ఆరోపణలు, విమర్శలతో ఇరు వర్గాలు రెచ్చిపోతున్నాయి. ఈ నేపథ్యంలో నెల రోజుల్లోగా మురికివాడల్లో నివసించే ప్రజలను రోడ్డుపడేసేందుకు కేంద్రం నోటీసులు ఇచ్చిందంటూ ఆప్‌ అధికార ప్రతినిధి రాఘవ్‌ చద్దా ఆరోపించారు. వాళ్ల ఇళ్లు కూల్చివేస్తామంటూ బెదిరింపులకు దిగిందని, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రాణాలతో ఉండగా.. పేద ప్రజలకు అన్యాయం జరగనివ్వబోరని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా తన చేతిలో ఉన్న నోటీసులను చించివేశారు.(చదవండి: రుణగ్రహీతలకు ‘సుప్రీం’ ఊరట!)

‘‘మురికివాడల్లోని ప్రజల బాగోగుల కోసం అరవింద్‌ కేజ్రీవాల్‌ ఒక కార్యాచరణ రూపొందించారు. తద్వారా ఎవరి ఇళ్లు కూల్చివేయాల్సిన అవసరం ఉండదు. మీ అందరిని నిరాశ్రయులు చేయాలనుకుంటున్న బీజేపీ కుట్రలు ఫలించవు. ఈ విషయంపై ఒకవేళ అవసరం అనుకుంటే సుప్రీంకోర్టుకు వెళ్తాం. వీధుల్లో పోరాటానికి సిద్ధమవుతాం. పునరావాసం, ఇళ్లకు ప్రత్యామ్నాయంగా సరికొత్త ఇండ్లు నిర్మించి ఇవ్వకుండా ఢిల్లీలో ఒక్క ఇల్లు కూడా కూల్చివేసే ప్రసక్తే లేదు. నోటీసులు ఇవ్వడం అక్రమం, అమానుషం. రాజ్యాంగం పౌరులకు కల్పించిన జీవించే హక్కును కాలరాసేలా ఉన్నాయి’’ అని చద్దా మండిపడ్డారు. 

ఇక రాఘవ్‌ చద్ధా వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ  అధికార ప్రతినిధి ప్రవీణ్‌ శంకర్‌ కపూర్‌.. 48 వేల ఇళ్ల గురించి ఢిల్లీ సర్కారు ఒక్కసారి కూడా కోర్టులో వాదనలు వినిపించలేదని విమర్శించారు. రాజీవ్‌ రతన్‌ హౌజింగ్‌ పథకంలో భాగంగా ఖాళీగా ఉన్న 50 వేల గృహాలకు వీరిని తరలించే అవకాశం ఉన్నా ఆ దిశగా ప్రయత్నాలు చేయడం లేదని మండిపడ్డారు. రాఘవ్‌ చద్ధా లాంటి వాళ్లు ప్రజల క్షేమం గురించి ఆలోచించకుండా కేవలం వారిని తప్పుదారి పట్టించి, చట్టపరంగా సమస్యల్లో నెట్టివేసేందుకే పనికివస్తారని ఘాటుగా విమర్శించారు. 

మరిన్ని వార్తలు