బాలుడి హత్య.. కాంగ్రెస్‌లో ముసలం, ఎమ్మెల్యే రాజీనామా

16 Aug, 2022 16:18 IST|Sakshi

జైపూర్: రాజస్థాన్‌లో దళిత బాలుడి హత్య అధికార కాంగ్రెస్‌ పార్టీలో కలకలం రేపింది. ప్రతిపక్ష బీజేపీ నుంచే కాకుండా సొంత పార్టీ నుంచి కూడా గెహ్లాట్‌ సర్కారు విమర్శలు ఎదుర్కొంటోంది. తొమ్మిదేళ్ల దళిత విద్యార్థి మృతి తనను తీవ్రంగా కలచివేసిందని బారన్‌ - అత్రుకు చెందిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యే పనాచంద్ మేఘ్వాల్ తన రాజీనామాను ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌కు పంపారు. కేసు విచారణలో పోలీసుల నాన్చుడు ధోరణికి వ్యతిరేకంగా రాజీనామా చేసినట్టు మేఘ్వాల్ వెల్లడించారు. 

అగ్రవర్ణాల కోసం ఉద్దేశించిన కుండలోని నీరు తాగినందుకు ఇంద్రకుమార్‌ మేఘవాలా దళిత విద్యార్థిని చెయిల్‌ సింగ్‌ అనే టీచర్‌ చావ బాదాడు. బాధిత చిన్నారి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం ప్రాణాలు వదిలాడు. రాజస్తాన్‌లోని జలోర్‌ జిల్లాలోని సురానా గ్రామంలోని ఓ ప్రైవేటు స్కూల్లో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. దీనిపై ఆగ్రహావేశాలు పెల్లుబికుతున్నాయి. 


కాంగ్రెస్‌లో పొలిటికల్‌ డ్రామా

దళిత బాలుడి మృతిపై కాంగ్రెస్ పార్టీలో రాజకీయ డ్రామా మొదలైంది. మొదటి నుంచి అశోక్‌ గెహ్లాట్‌ను వ్యతిరేకిస్తున్న మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్‌ పైలట్‌ మంగళవారం సురానా గ్రామానికి పయనమయ్యారు. బాలుడు కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రభుత్వంపై ప్రశ్నాస్త్రాలు ఎక్కుపెట్టారు. ‘దళిత బాలుడి మృతి  దిగ్భ్రాంతికర దారుణ ఘటన. సమాజంలో ప్రబలంగా ఉన్న దురాచారాలను మనం అంతం చేయాలి. ప్రభుత్వం, అధికార యంత్రాంగం మొక్కుబడిగా కాకుండా బాధిత కుటుంబానికి సత్వరమే పూర్తి న్యాయం చేయాల’ని సచిన్‌ పైలట్‌ డిమాండ్‌ చేశారు. 


పైలట్‌కు చెక్‌ పెట్టేలా..

జలోర్‌ జిల్లాకు సచిన్‌ పైలట్‌ వెళుతున్నారని తెలియగానే సీఎం గెహ్లాట్‌ అప్రమత్తమయ్యారు. పైలట్‌కు పొలిటికల్‌ మైలేజీ రాకుండా చేయాలన్న ఉద్దేశంతో క్యాబినెట్‌లో సీనియర్ మంత్రులు, రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ గోవింద్ సింగ్ దోతస్రాను హుటాహుటిన జలోర్‌కు పంపించారు. అంతేకాదు త్వరతగతిన దర్యాప్తు చేసి, బాధిత కుటుంబానికి త్వరగా న్యాయం జరిగేలా చూడాలని అధికారులను ఆదేశించినట్లు ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ మీడియాకు తెలిపారు. బాలుడి కుటుంబానికి రూ. 5 లక్షల సాయం కూడా ప్రకటించారు.
(క్లిక్: వాళ్ల కాళ్లు విరగొట్టండి.. నేను బెయిల్‌ ఇస్తా)

బీజేపీ మండిపాటు
దళిత బాలుడి హత్య సిగ్గుచేటని పేర్కొంటూ గెహ్లాట్‌ సర్కారుకు ప్రతిపక్ష బీజేపీ విమర్శించింది. రాజస్థాన్‌లో దళితులకు న్యాయం జరిగేలా గెహ్లాట్‌ను రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా ఎప్పుడు ఆదేశిస్తారని పశ్నిస్తూ ట్వీట్‌ చేసింది. కాగా, దళిత బాలుడి మరణానికి కారణమైన టీచర్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. నిందితుడిపై హత్యా నేరంతోపాటు ఎస్సీ/ఎస్టీ (అట్రాసిటీ నిరోధక) చట్టం కింద కేసు నమోదు చేశారు. (క్లిక్: ప్రధాని వ్యాఖ్యలు.. బీజేపీని ఉద్దేశించినవే!)

మరిన్ని వార్తలు